21-02-2026 01:28:54 AM
సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయించాలి
బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాల్సిందే..
విద్య, ఉద్యోగ, కాంట్రాక్టులలో 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి
ఇస్తే తీసుకుంటాం.. లేకుంటే గుంజుకుంటాం
లేదా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం
టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
పార్టీ కార్యకర్తలతో అసెంబ్లీ ముట్టడికి యత్నం
అడ్డుకున్న పోలీసులు
ముషీరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాల్సిందేనని, లేదంటే రాష్టా న్ని అగ్నిగుండం చేస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.55 వేల కోట్లు కేటాయించా లని, విద్య, ఉద్యోగ అవకాశాలు, కాంట్రాక్టులలో 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద మెరుపు ధర్నా నిర్వహించారు. అటు నుంచి తీన్మార్ మల్లన్న సమక్షంలో పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి దూసుకెళ్లారు. తీన్మార్ మల్లన్నను, పార్టీ కార్యకర్తలను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.55వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, విద్య, ఉపాధి, ఉద్యోగ, కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. బీసీ సబ్ ప్లాన్‌ను తక్షణమే అమలు చేసి, బీసీలకు కేటాయించాల్సిన నిధులను పూర్తిగా విడుదల చేసి, ఆ నిధులను బీసీ వర్గాల అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రాన్ని అగ్ని గుండం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో బీసీ వర్గాలు జనాభాలో అధిక శాతం ఉన్నప్పటికీ, వారికి తగిన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్ చట్టబ ద్ధంగా అమలు చేసి బీసీలకు రావాల్సిన 55వేల కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉపాధి, స్వ యం ఉపాధి, గృహ నిర్మాణం, వృత్తి అభివృద్ధి వంటి రంగాల్లో బీసీలకు 42 శాతం అమలు చేయాలని అలా జరిగినప్పుడే బీసీలకు నిజమైన లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వాలు ఏటా బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నప్పటికీ, ఆ నిధులు పూర్తిగా ఖర్చు కావడం లేదని, ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఇది బీసీ వర్గాల పట్ల అన్యాయం మాత్రమే కాకుండా, వారి హక్కుల ఉల్లంఘన అని అన్నారు. బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ వర్గాలకు న్యాయం చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతామని పార్టీ హెచ్చరించారు.
ఈ మెరుపు ధర్నాలో పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, విద్యార్థి సంఘం నాయకులు వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, ముఖ్య నాయకులు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొని తమ ఐక్యతను చాటారు. కార్యక్రమంలో బీసీ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాలు కూడా మద్దతునిస్తూ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రభుత్వాన్నిగద్దె దింపుతాం: టీఆర్వీఎస్
రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని, లేదంటే ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని టీఆర్వీఎస్ నాయకులు హెచ్చరించారు. బీసీలను చిన్నచూపు చూడాలని చూస్తే సహించబోమన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. లేదంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపట్టబోయే ఉద్యమ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం అవుతుందని, తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు రాజు గౌడ్ హెచ్చరించారు.