ఆ బ్యానర్‌లో కార్తీ వరుసగా నాలుగో సినిమా
ప్రిన్స్ పిక్చర్స్ మరో క్రేజీ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించింది. హీరో కార్తీ, ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లో కొత్త సినిమాను ప్రకటించింది. ఎస్ లక్ష్మణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాలతోపాటు హీరోయిజాన్ని అద్భుతంగా మేళవించిన ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.
కార్తీ, మోహన్‌రాజా కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌లో కార్తీకి ఇది వరుసగా నాలుగో చిత్రం. ఇంతకుముందు ‘దేవ్’, ‘సర్దార్’, ‘సర్దార్ 2’ చిత్రాల తర్వాత మరోసారి ఈ బ్యానర్‌తో ఆయన చేతులు కలిపారు. ‘సర్దార్ 2’ విడుదలకంటే ముందే ఈ కొత్త ప్రాజెక్టును ప్రకటించడంతోనే సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక బృందం, రెగ్యులర్ షూటింగ్ వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటిస్తారు.






