26 June, 2026 | 1:59 AM

ప్రతి ఇంటి వరకు వెళ్లే చిత్రమిది

26-06-2026 12:47 AM

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 19న రిలీజై, ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ థాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. “మా ఇంటి బంగారం’ సినిమాకు వస్తున్న స్పందన చూసిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది.

మూడేళ్ల తర్వాత చేసిన సినిమా ఇది. ఒక స్టార్ హీరోను ఎలా హైప్ చేస్తారో మా టీమ్ నన్ను హైప్ చేశారు. సినిమాను ఇంత భారీ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా థాంక్స్‌” అన్నారు. డైరెక్టర్ నందినీరెడ్డి మాట్లాడుతూ.. “సామ్‌ను గతం కంటే పది రెట్లు ఎక్కువగా చూస్తారని ముందుగానే చెప్పా. అదే నిజమైంది” అన్నారు. నిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. “మేం హిందీలో ఫ్యామిలీ మ్యాన్, స్త్రీ వంటి సబ్జెక్ట్స్ను ప్రేక్షకులకు అందించాం. మా ఇంటి బంగారం సినిమాకు వచ్చినంత స్పందన ఎక్కడా రాలేదు. ఈ సినిమా ప్రతి ఇంటి వరకు వెళుతుంది” అని చెప్పారు.