మనసున్న ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా వెంకట్రామయ్య గారి తాలూకా
దినేశ్‌కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’. సతీశ్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేశ్ సారిపల్లి నిర్మించారు. ఇందులో మురళీధర్‌గౌడ్, సుధ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ.. “ముత్యాల సుబ్బ య్య చిత్రాలను గుర్తు చేసే గొప్ప కథ ఇది. చాలా కాలం తర్వాత ఇలాంటి కథ వినడంతో మా అమ్మాయి దివిజను ఈ సినిమా చేయమని ప్రోత్సహించా. డాక్టర్ అవుతుందనుకున్న మా అమ్మాయి ఈ సినిమాతో నటిగా పరిచయమవుతోంది. అందరూ ఆశీర్వదించాలి” అన్నారు. హీరో దినేశ్‌కుమార్ మాట్లాడుతూ.. “అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించే చిత్రం అవుతుంది” అన్నారు.
‘అందరికీ నచ్చే కథ ఇది. జూలై 18న ప్రేక్షకులంతా థియేటర్లలో చూసి ఆదరించాలి’ అని హీరోయిన్ దివిజ ప్రభాకర్ తెలిపారు. దర్శకుడు సతీశ్ ఆవాల మాట్లాడుతూ.. “మన దేశ సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం గొప్ప సంప్రదాయం. కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా చూపిస్తుంది. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది” అని చెప్పారు. నిర్మాతలు కోమలి, మహేందర్ మాట్లాడుతూ.. “ఈ సినిమా చూస్తున్నంతసేపు కంటతడి పెట్టకుండా ఎవరూ బయటకు రారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని నిర్మించాం” అన్నారు.






