26 June, 2026 | 3:17 AM

శ్రీకారం చుట్టుకున్న ఇడుపు కాయితం

26-06-2026 12:49 AM

టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా ‘ఇడుపు కాయితం’. యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి ఈ సినిమాను తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఎంటర్‌టైనింగ్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగ దుర్గ హీరోయిన్‌గా అలరించనుంది. శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనికరెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహిస్తుండగా, ఎంఎన్ బాల్‌రెడ్డి డీవోపీని నిర్వహిస్తున్నారు.

ఆశిష్ తేజ ఆర్ట్ డైరెక్టర్‌గా, శ్రీధర్ సొంపల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, నవీన్ యెర్నేని, కేఎల్ దామోదరప్రసాద్, ఎస్‌కేఎన్, బాపినీడు, ధీరజ్ మొగి లినేని, దర్శకులు మెహర్ రమేవ్, చందూ మొండేటి, సాయిరాజేశ్, వేణు ఊడుగుల, సాయి మార్తాండ్ ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో శ్రీనివాస్ అనే పాత్రలో కనిపించబోతున్నా. ఇది తెలంగాణ నేపథ్య సినిమా అయి ఉండొచ్చు.

తెలంగాణ భాష, యాస, తిండి, బట్ట అంతా కనిపించవచ్చు కానీ గర్వంగా చెప్పగలను ఇది గ్లోబల్ స్థాయి సినిమా. ఈ కథ మూలాలు ప్రతి ఇంట్లో ఉంటాయి” అన్నారు. హీరోయిన్ నాగదుర్గ మాట్లాడుతూ.. “ఇడుపు కాయితం’తో హీరోయి న్‌గా వస్తున్నా. ఇండస్ట్రీకి హీరోయిన్‌గా రావాలని ఎందరో అమ్మాయిలు కోరుకుంటారు. అందరి ప్రోత్సా హంతో నాకు ఈ అవకాశం వచ్చింది. నేను ఈ స్టోరీని నమ్మాను. నన్ను ఈ స్టోరీ నమ్మింది. ఈ కథలో నేను చేస్తున్న శ్రీలత అనే పాత్ర చాలా బరువైంది. ఈ సినిమాను థియేటర్లలో చూస్తూ రచ్చరచ్చ చేసేస్తారని చెప్పగలను” అన్నారు. ‘మా సినిమా కు అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాన’ని చిత్ర దర్శకుడు వంశీరెడ్డి తెలిపారు.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. “చాలా మంచి కథతో ఈ సినిమా చేస్తున్నాం. సబ్ టైటిల్స్‌తో బీహార్‌లో వేసినా అక్కడ ప్రేక్షకులు కూడా చూసే చిత్రమిది. మన అందరి ఇళ్లలో ఒక కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అది పెళ్లయిన వారికి తెలుసు. ‘ఇడుపు కాయితం‘తో ఒక మంచి తెలుగు సినిమా చూడబో తున్నాం. రైట్ టైమ్‌లో నా దగ్గరకు వచ్చిన రైట్ ప్రాజెక్ట్ ఇది” అని చెప్పారు. నిర్మాత తబిత సుకుమార్ మాట్లాడుతూ.. “నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. పక్కా తెలంగాణ అమ్మాయిని. డైరెక్టర్ వంశీ ఈ కథ చెబుతున్నప్పుడు నేను ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లిపోయా. అందరూ తప్పకుండా ఈ సినిమా కనెక్ట్ అవుతారు. సుకుమార్ రైటింగ్స్‌లో ఇదొక మైల్ స్టోన్ లాంటి సినిమా అవుతుంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రబృందం అంతా మాట్లాడారు.