26 June, 2026 | 2:34 AM

ప్రజారోగ్యం.. హారతి కర్పూరం!

26-06-2026 12:53 AM

హోటళ్లు, రెస్టారెంట్లలో నాణ్యతలేని ఆహారం

నిద్రమత్తులో ఫుడ్‌సేఫ్టీ అధికారులు

తూతూ మంత్రంగా తనిఖీలు

కూకట్‌పల్లి, జూన్ 25 (విజయక్రాంతి): సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ సర్వసాధారణమైంది. సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపై ఎంతో కొంత కనిపిస్తుండడంతో వ్యాపారస్థులు సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు.

అయితే, తమ హో టళ్లు, రెస్టారెంట్లకు వచ్చే వినియోగదారులకు అంతే నాణ్యమైన ఆహారం ఇవ్వడంలో నిర్వాహకులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అధిక లాభాల కోసం ప్రజల ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు. తాజాగా కూకట్పల్లి పరిధిలోని ప్లాట్ ఫామ్ 65పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులతో అసలు నిజాలు బట్టబయాలయ్యాయి...

సోషల్ మీడియాలో ప్రచారం..

చాలావరకు హోటల్ నిర్వాహకులు సోష ల్ మీడియాలో ప్రచారానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఆహార పదార్థాల శుభ్రతపై చూపించకపోవడంతో ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్లాట్ ఫామ్ 65పై ఫుడ్సేఫ్టీ అధికారుల దాడుల్లో కుళ్లిన మాంసం, పాచిపోయిన పదార్థాలు నిలువ ఉండడంతోపాటు వంటగది లో బొద్దింకలు, ఎలుకలు తిరుగుతూ అపరిశుభ్రంగా ఉండటంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఈ హోటల్ హైజిన్ రేటింగ్లో 110 మార్కులకు కేవలం 40 మార్కులు (37 శాతం) రావడం విస్మయం కలిగిస్తుంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో వెలుగుచూసిన నిజాలను చూసి వినియోగదారులు అవాక్కవుతున్నారు. తాము తిన్నది ఇలాంటి ఆహారమేనా అని విస్తుపోతున్నారు. సోషల్ మీడియా ప్రచారం ఊపందుకోవడంతో హోటల్ నిర్వాహకులు చేసే ప్రకటనలు చూసి మోసపోవద్దని అనుకుంటున్నారు.

తూతూ మంత్రంగా తనిఖీలు..

కూకట్పల్లి నియోజకవర్గంలో పలు హో టళ్ల నిర్వాహకులు శుచి శుభ్రత పాటించకుండా లాభమే ధ్యేయంగా కల్తీ ఆహారాలు విక్రయిస్తున్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారులు నెలనెలా తమకు  రావాల్సిన ఆమ్యామ్యాలు తీసుకొని అటువైపు చూడటం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.  ఎక్కడో ఒక చోట ఆహారం కల్తీ అయిందని, శుచి, శుభ్రత పాటించడం లేదని ఫిర్యాదులు వస్తే తప్ప ఫుడ్సేఫ్టీ అధికారులు కనిపించడం లేదని విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంపై ఆహార ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు మొద్దు నిద్ర వీడాలి..

నిత్యం ఉద్యోగరీత్యా తీరిక లేకుండా ఉండే నేటితరం యువకులు ఉద్యోగస్తులు బయట ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా అలవాటు పడ్డారు. దీంతో వాళ్ళ అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటున్న కొందరు హోటల్ నిర్వాహకులు లాభమే లక్ష్యంగా కల్తీ ఆహారాన్ని అంటగడుతున్నారు.

దీని నియంత్రించాల్సిన అధికారులు సైతం ప్రతినెల తన మామూలులకు అలవాటు పడి ఆ పక్కకు కూడా చూడకపోవడంతో హోటల్ నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ మొద్దు నిద్ర వీడి తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. నాణ్యత, రుచితో కూడిన ఆహారాన్ని వినియోగదారులకు అందించినట్లయితే హోటల్ నిర్వాహకులకు ప్రకటనల అవసరం లేకుండానే మన్ననలను పొందవచ్చు.

రవీందర్, పాలమూరు సంక్షేమ సంఘం కార్యదర్శి, ఎల్లమ్మబండ