15 July, 2026 | 1:33 AM

కాంగ్రెస్‌ను కాలగర్భంలో కలుపుతున్నారు

15-07-2026 01:33 AM
  1. సామాజిక న్యాయానికి తిలోదకాలు వలస వచ్చిన వారికి అందలం 
  2. పాలకుర్తి ఎమ్మెల్యే, ఇన్చార్జి పై పీసీసీ అధ్యక్షుడికి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

మహబూబాబాద్, జులై 14 (విజయక్రాంతి): పాలకుర్తి నియోజకవర్గం లో ఏళ్ల తరబడిగా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డ వారిని పక్కనపెట్టి, వలస వచ్చినవారికి ప్రాధాన్యమిస్తూ, సామాజిక న్యాయానికి తిలోదకాలిస్తూ, కాంగ్రెస్ పార్టీని పాలకుర్తిలో కాలగర్భంలో కలిపే విధంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు పాలకుర్తి కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఫిర్యాదు చేశారు.

గత రెండు సంవత్సరాలుగా వలస వచ్చిన వారికే పార్టీ పదవులు ఇతర కార్యక్రమాల్లో ప్రాధాన్యమిస్తూ, పార్టీ జెండాను భుజాలపై మోసిన కార్యకర్తలను విస్మరిస్తున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సైతం ఫిర్యాదు చేశారు. పాలకుర్తి నియోజకవర్గం లో సుమారు 75 వేల ఓట్లకు పైచిలుకగా ఉన్న దళితులను అవమానిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు ఇచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని, గత మున్సిపాలిటీ ఎన్నికల్లో తొర్రూరులో నాలుగు కౌన్సిలర్ స్థానాలు ఎస్సీ కి రిజర్వు కాగా మాదిగ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ ఇవ్వలేదన్నారు.

గత సర్పంచి, మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం మూలాన 95 శాతం గెలవాల్సిన సీట్లు గెలవలేదని,  కొత్తగా వచ్చిన వారందరూ ఓడిపోయారని, అయినా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అది చాలదన్నట్లుగా కొత్తవారికి మండల అధ్యక్ష పదవులు కట్టబెట్టడం పలువురు సీనియర్ నాయకుల రాజీనామాలకు కారణమైందన్నారు. ఇప్పటికైనా పాలకుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు పార్టీ హై కమాండ్ చర్యలు చేపట్టాలని కోరుతూ నాయకులు వినతి పత్రాలు అందజేసినట్లు చెప్పారు.