15 July, 2026 | 1:30 AM

ఆఖరి దశలో మహాకాళి

15-07-2026 01:30 AM

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘మహాకాళి’ చివరి దశ చిత్రీకరణలోకి అడుగుపెట్టింది. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మైథాలజికల్ ఎపిక్‌కు ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం 125 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరిస్తున్నారు. ఇక షూటింగ్‌లో మరో కీలక మైలురాయిని ఈ చిత్రం చేరుకుంది. ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్న రోహిత్ సరాఫ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. శుక్రాచార్య పాత్రలో నటిస్తున్న అక్షయ్ ఖన్నా ఇప్పటికే తన భాగం చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ చిత్రంలో మహాకాళి పాత్రలో భూమి శెట్టి నటిస్తున్నారు.

ఆధ్యాత్మిక వైభవాన్ని అత్యాధునిక సినీ సాంకేతికతతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక మైథాలజికల్ చిత్రాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటోందీ సినిమా. ప్రస్తుతం చివరి షెడ్యూ ల్ చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. త్వరలోనే షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి; డీవోపీ: సురేశ్ రగతు; ప్రొడక్షన్ డిజైన్: శ్రీ నాగేంద్ర తంగాల; నిర్మాత: రివాజ్ రమేశ్ దుగ్గల్; దర్శకత్వం: పూజ అపర్ణ కొల్లూరు.