4 July, 2026 | 1:45 AM

ఓటర్ల వివరాల నమోదులో తప్పులు ఉండొద్దు

04-07-2026 12:38 AM

వివరాలు తప్పులు లేకుండా నమోదు చేయాలి

ఓటర్ల వివరాలను బీఎల్‌ఓ యాప్‌లో పక్కాగా ఉండాలి 

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలి

రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి 

ఎల్బీనగర్లో ఎన్యూమరేషన్ పరిశీలన 

ఎల్బీనగర్, జూలై 3: ఓటర్ల వివరాల నమోదులో ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని బీల్వోలు, సర్వే ఎన్యూమరేట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం అమలు తీరును ఎల్బీనగర్ నియోజకవర్గంలో శుక్రవారం కలెక్టర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాల ద్వారా సేకరించిన వివరాలను బీఎల్వో యాప్లో స్పష్టంగా ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు వార్డుల్లో కొనసాగుతున్న ఇంటింటి ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ నారాయణ రెడ్డి,  జోనల్ అధికారి వికాస్ మహతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జిల్లాలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి ఎన్యుమరేషన్ కార్యక్రమం కొనసాగుతోందన్నారు.

ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేయడంతోపాటు ఆ వివరాలను వెంటనే బీఎల్వో యాప్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఓటర్లు పూర్తి చేసిన ఫారాలను సేకరించి, అందులో పొందుపరిచిన వివరాలను యాప్లో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు, నకిలీ నమోదులు లేదా అనర్హుల పేర్లు లేకుండా అత్యంత పారదర్శకంగా, విశ్వసనీయంగా ఓటరు జాబితాను రూపొందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

పరిశీలనలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) నిర్వహిస్తున్న సర్వే విధానం, ఫారాల పంపిణీ, యాప్లో నమోదు ప్రక్రియ, పూర్తి చేసిన ఫారాల సేకరణ తదితర అంశాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు. ప్రతి అర్హుడికి ఒకే ఓటరు గుర్తింపు కార్డు ఉండేలా చర్యలు చేపట్టి, ఖచ్చితమైన, తప్పులేని, పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

బీఎల్వోలు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలకు కార్యక్రమంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ నిర్ణీత గడువులోపు ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. చైతన్యపురి డివిజన్ లోని హనుమాన్ నగర్ లో ఉన్న 523, 524, 525 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించగా, లింగోజిగూడ డివిజన్ లోని శాతవాహన నగర్ లో జోనల్ కమిషనర్ వికాస్ మహాతో అధికారులతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అమలును పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ కమిషనర్లు, బీఎల్వోలు, అధికారులు పాల్గొన్నారు.