గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు
వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, మార్చి 13 (విజయక్రాంతి): జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ లకు ఎలాంటి కొరతలేదని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ స్పష్టం చేశారు. శుక్రవారం అయన అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో ఎల్పిజి గ్యాస్ సరఫరాపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 4, 15, 509 డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయని ప్రస్తుతం జిల్లాలో 17, 647 డొమెస్టిక్ సిలిండర్లు, 4,552 కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, గ్యాస్ బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల్లోనే వినియోగదారులకు సకాలంలో డెలివరీ చేయడం జరుగుతుందన్నారు. కమర్షియల్ సరఫరాలో ఏర్పడిన కొరతను అధిగమించేందుకు ఉపశమనం వైపు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదన్నారు.
గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ను ఎవరైనా కమర్షియల్ గా వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరత లేనందున ప్రజలు ఆందోళనకు గురై అనవసరంగా గ్యాస్ బుక్ చేసుకోవద్దన్నారు. సీనియారిటీ ప్రకారం ఏజెన్సీలు గ్యాస్ ను సరఫరా చేయడం జరుగుతుందన్నరు.
గ్యాస్ బుకింగ్ కు సంబంధించి సర్వర్ సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ విషయమై సంబంధిత గ్యాస్ ఏజెన్సీ లతో మాట్లాడడం జరిగిందని, త్వరలోనే సర్వర్ సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఎవరైనా ఏజెన్సీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జిల్లా పౌర సరఫరా అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ సివిల్ సప్లై రాము పాల్గొన్నారు.




