18 May, 2026 | 2:20 AM

కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే.. మళ్లీ అభివృద్ధి

18-05-2026 01:35 AM

కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలోకి హైదరాబాద్

  1. టిమ్స్ ఆస్పత్రుల జాప్యంపై త్వరలో భారీ ధర్నా
  2. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో
  3. పార్టీ విజయానికి ఇప్పటి నుంచే కృషి చేయాలి
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్/ఎల్బీనగర్, మే 17 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి పట్టాలు ఎక్కాలి అంటే కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తీసుకురావడమే ఏకైక మార్గ మని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం లో హైదరాబాద్ మహానగరం సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. ఉన్న నగరాన్ని వదిలేసి ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి వృథా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి నిరసిస్తూ త్వరలో భారీధర్నా నిర్వహిస్తామని చెప్పారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ విజయానికి ఇప్పటి నుంచే కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సి వ్ రివిజన్ (సర్)పై అప్రమత్తంగా ఉండాలని, ఏ ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూడాలన్నారు. ఆదివారం ఎల్బీనగర్ నియోజక వర్గంలో జరిగిన ‘మన బూత్ బాధ్యత’ అనే ప్రత్యేక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోగ్రాంలో కేటీఆర్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లతో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ పలు అంశాలపైన వివరంగా మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం పూర్తిగా సంక్షోభంలోకి జారుకున్నదన్నారు. కనీస పౌర సదుపాయాలు కూడా నిర్వహించలేని దుస్థితిలోకి నగరం వెళ్లిందని విమ ర్శించారు. ఉన్న నగరాన్ని వదిలేసి ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్‌రెడ్డి వృథా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్న నగర నిర్వహణ చేయడం చేతగాని రేవంత్‌రెడ్డి, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపా రం కోసం ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారాంతాల్లో, సెలవు రోజుల్లో బుల్డోజర్లను పేదల ఇండ్ల పైకి పంపిస్తూ రెండున్నర సంవత్సరాల పాటు వేలాది మంది ఇండ్లను కూల్చివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపడితే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న రోడ్లు, అండర్ పాస్ లు, ఫ్లైఓవర్లు గత ప్రభుత్వ చొరవతో, కృషితో వచ్చినవే అని వాటి వెనుక ఎంత శ్రమ, ఎంత నిబద్ధత ఉన్నదో గుర్తించాలని ప్రజలను కేటీఆర్ కోరారు. ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వంలో, స్థానిక ఎమ్మె ల్యే సుధీర్‌రెడ్డి చొరవతో వేల కోట్ల నిధులతో ఎల్బీనగర్ నియోజకవర్గం రూపురేఖలను మార్చారని అభినందించారు. గత ప్రభుత్వం లో కేసీఆర్ పేదలకు అండగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన విషయాలను..

గతంలో ఉన్న ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్, కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి అనేక అంశాల గురించి ప్రస్తుతం ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నదన్నా రు. గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి సంక్షే మ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఆపివేసిందని, మరోవైపు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించకుండా అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. రెండున్నర సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. 

గత ప్రభుత్వం ‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’(టిమ్స్) పేరుతో ఆస్పత్రుల నిర్మాణానికి చర్యలు చేపడితే... ప్రస్తుతం గడ్డిఅన్నారంలో జరుగుతున్న నిర్మాణం పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. త్వరలోనే ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యం లో టిమ్స్ ఆస్పత్రి భవన నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా భారీ ధర్నాను చేపడతామని కేటీఆర్ హెచ్చరించారు. ఇక ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)(ఓటర్ల వడపోత) కార్యక్ర మానికి సంబంధించి పార్టీ తరఫున గుర్తించిన బూత్ లెవెల్ ఏజెంట్లు నిబద్ధతతో, పట్టుదలగా పనిచేయాలన్నారు. తమ పరిధిలో ఉన్న... తమ బూత్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికీ వెళ్లి ఎవరి ఓటు కూడా అన్యాయంగా తొలగించకుండా చూడాలని సూచించారు. 

కచ్చితంగా హైదరాబాద్ నగరంలో రాను న్న కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేసిన కేటీఆర్, ఆ దిశగా ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంతోపాటు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రజలను జాగృతం చేయాలని సూచించారు. కచ్చితంగా పార్టీ శ్రేణులు ఈ దిశగా బలంగా కృషి చేస్తే రానున్న అన్ని ఎన్నికల్లో మన పార్టీ ఘనమైన విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.