క్వింటాల్‌కు 300 నష్టం!
ధాన్యం మిల్లింగ్ నష్టంపై లబోదిబోమంటున్న రైస్ మిల్లర్లు
రా రైస్ 67 శాతం, బాయిల్డ్ రైస్ 68 శాతం అసాధ్యమంటున్న మిల్లర్లు
అక్రమాలను ప్రోత్సహించేలా ప్రభుత్వ నిబంధనలంటూ నిష్ఠూరం
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి అన్నట్టుగా ఉంది రాష్ట్రంలో రైస్ మిల్లర్ల పరిస్థితి. ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సరఫరాలో అక్రమాలు జరిగాయంటున్నారే గానీ.. అసలు మిల్లర్లకు విధిస్తున్న నిబంధనలు.. ఆ నిబంధనల పేరుతో బియ్యం ఇవ్వాలనే ఒత్తిడి.. బియ్యం తీసుకునేటప్పుడు జరుగుతున్న నష్టాలను మిల్లర్లు ఏకరువు పెడుతున్నారు. అది వానకాలం అయినా.. యాసంగి అయినా.. టెస్ట్ మిల్లిం గ్ చేసి నిర్ధారించాల్సిన సర్కారు ఆ విషయంలో తాత్సారం చేస్తూనే సాధ్యంకాని నిబంధనలను విధిస్తూ దౌర్జన్యంగా బియ్యం పిండుకుంటున్నదని, దీనికితోడు తమపై అక్రమాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏ సీజన్ అయినా అసాధ్యం..
నిజానికి అటు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)గానీ, ఇటు పౌర సర ఫరాల శాఖగానీ వాస్తవ విరుద్ధంగా నిబంధనలను రూపొందిస్తూ మిల్లర్ల నుంచి బియ్యాన్ని పిండుకుంటున్నారని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. వానకాలం అయినా.. యాసంగి అయినా.. 67 శాతం రా రైస్.. 68 శాతం బాయిల్డ్ రైస్ ఇవ్వడం అసాధ్యమంటున్నారు మిల్లర్లు. వానకాలంలోనే సాధ్యం కాదంటే.. ఇక యాసంగిలో అసలే సాధ్యం కాదని మిల్లర్లు గణాంకాలను చూపుతున్నారు.
ఉదాహరణకు.. సన్నరకం ధాన్యం విషయాన్నే పరిశీలిద్దాం. ఒక క్వింటా లు సన్నరకం ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే.. 65 శాతానికి మించి నాణ్యమైన రా రైస్ రావని మిల్లర్లు పేర్కొంటున్నారు. అంటే 2 శాతం వారికి నష్టం వచ్చినట్టే. అదే యాసంగిలో అయితే 60 శాతానికి మించి బియ్యం రావని.. అంటే 7 శాతం నష్టాన్ని తాము ఎలా భరించాలని, ఇలాంటి సమయంలో తాము ఏం చేయాలని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ లెక్కన వానకాలంలో క్వింటాలు ధాన్యానికి 2 కిలోల బియ్యం, యాసంగిలో 7 కిలోల బియ్యం నష్టపోతున్నామని మిల్లర్లు వివరిస్తున్నారు.
అక్రమాలకు అక్కడే బీజం..
ప్రభుత్వం విధించే నిబంధనలు వాస్తవాల కు భిన్నంగా ఉన్నాయని మిల్లర్లు వాపోతున్నారు. అసలు మిల్లింగ్ చేస్తే.. 67 శాతం రా రైస్.. 68 శాతం బాయిల్డ్ రైస్ రావని చెబుతున్నా సర్కారు ససేమిరా అంటూ అలాగే చేయాలని తమపై ఒత్తిడి పెంచుతున్నట్టు మిల్ల ర్లు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్లకు రవాణా అంశాల్లో నెలకొన్న తీవ్ర ఇబ్బందులకు ఇదే అంశం కారణమని వారు పేర్కొంటున్నారు.
ఎప్పటికప్పుడు టెస్ట్ మిల్లింగ్ చేసి.. నిబంధన లు, మార్గదర్శకాలను విధించాల్సిన ప్రభు త్వం.. టెస్ట్ మిల్లింగ్ విషయంలో తాత్సారం చేస్తున్నదని మిల్లర్లు చెప్తున్నారు. గడిచిన ఒకటిన్నర సంవత్సరాలుగా టెస్ట్ మిల్లింగ్ చేయలేదని, పైగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా బియ్యం వస్తాయని మిల్లర్లు ఖరాకండిగా చెబుతున్నారు. రాండమ్‌గా చేయకుండా ప్రతి మిల్లుకు వచ్చిన ధాన్యం నుంచే టెస్ట్ మిల్లింగ్ చేస్తే.. వాస్తవం బయటపడుతుందని మిల్లర్లు చెప్తున్నారు.
దాని ప్రకారం బియ్యాన్ని ఇవ్వాలనే నిబంధనపై తమకు ఎలాంటి అభ్యంతర లేదని, కానీ, టెస్ట్ మిల్లింగ్ చేయకుండానే.. కచ్చితంగా 67 శాతం ఇవ్వాలంటే తాము ఏంచేయాలని మిల్లర్లు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిళ్లు, గడువులోగా బియ్యం ఇవ్వాలనే ఆదేశాలతో క్వింటాలుకు సుమారు 7 కిలోలు తగ్గిన బియ్యం లోటును పూడ్చుకోవడంలో భాగంగానే.. మిల్లర్లు అక్రమాలకు తెరలేపాల్సివస్తున్నదని వాపోతున్నా రు. అంటే ప్రభుత్వమే అక్రమాలకు ఉసిగొల్పేలా నిబంధనలు రూపొందించి.. ఒత్తిడి తెచ్చి.. కేసుల భయాన్ని సృష్టించి.. మిల్లర్లను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తుందనే విమర్శలకు సరైన సమాధానం రావడం లేదు.
ఏదేమైనా.. శాస్త్రీయమైన పద్ధతుల ప్రకార.. ముందుకు సాగాల్సిన బియ్యం సేకరణ అంశం.. ధాన్యం సేకరణ, రవాణా నుంచి బియ్యం సరఫరా వరకు పూర్తిగా విమర్శలు, అక్రమ మార్గాలు, అవినీతి ఆరోపణలకు ఆస్కారం కలిగించేలా ప్రభుత్వమే వ్యవహరిస్తుండటంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమ వుతున్నది. ఇప్పటికైనా ఈ విమర్శలకు చెక్ పెట్టేలా పూర్తి పారదర్శకంగా, ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ.. ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాను చేపట్టాలని మిల్లర్లు కోరుతున్నారు.
మిల్లర్లకు లాస్ తప్పదు..
ఈ గణాంకాలను ఒక రైస్ మిల్లు స్థాయిలో పరిశీలిస్తే.. రైస్ మిల్ సామర్థాన్ని బట్టి ధాన్యాన్ని ఇస్తారు. అయితే సగటున ఒక్కో రైస్ మిల్లుకు సుమారు లక్ష క్వింటాళ్ల ధాన్యం మిల్లింగ్ కోసం సరఫరా చేస్తారనుకుందాం. ఈ గణాంకాల ప్రకారం.. 67,000 క్వింటాళ్ల బియ్యాన్ని ఇవ్వాలి. కానీ, యాసంగిలో చూసుకుంటే.. 60,000 క్వింటాళ్ల బియ్యం మాత్రమే వస్తాయి. ఇక్కడ 7,000 క్వింటాళ్ల బియ్యం మిల్లరుకు నష్టం వాటిల్లుతుంది. ఈ 7 వేల క్వింటాళ్ల బియ్యాన్ని అందించాలంటే.. 10,447 క్వింటాళ్ల ధాన్యం అవసరం.
దీనిని ధాన్యం ధరల్లోనే పరిశీలిస్తే.. ప్రస్తుతం ఒక క్వింటాలు సన్నరకం ధాన్యం రూ. 2,360తో పాటు రూ. 500 బోనస్ కలుపుకుంటే మొత్తంగా రూ. 2,98,78,420 అవుతుంది. అంటే.. కాస్త అటుఇటుగా.. రూ.3 కోట్లు అన్నమాట. ఈ లెక్కన రైస్ మిల్లుకు వచ్చి న లక్ష క్వింటాళ్ల ధాన్యం మిల్లింగ్ చేసి.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 67 శాతం బియ్యాన్ని అప్పగిస్తే.. మిల్లరుకు వచ్చే నష్టం రూ. 3 కోట్లు. అంటే క్వింటాలుకు రూ. 300 చొప్పున నష్టం వాటిల్లినట్టే.






