సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
మిర్యాలగూడ, మార్చి 13: నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ నియోజకవర్గంలోని నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక సన్నాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజులపాటు నిర్వహించవలసిన కార్యక్రమాలను వివరించారు. ఇందులో భాగంగా మార్చి 6 నుండి 15 వరకు అన్ని గ్రామాలు, పట్టణాలు కార్యాలయాలలో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టేందుకు దిశ నిర్దేశించడం జరిగిందన్నారు. అంతేకాక అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలలో ఫైళ్ళను పరిష్కారం చేపట్టినట్లు తెలిపారు.
ఎంపీడీవోలు గ్రామ వారీగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితా రూపొందించి ఏప్రిల్ 2వ తారీఖున నిర్వహించనున్న గ్రామసభలలో వాటిని చదివి వినిపించాలనాడు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని ఉగాది నాటికి సామూహిక ఇందిరమ్మ గృహప్రవేశాలను చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటి నుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా వ్యాప్తంగా విద్యార్థులందరూ పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో నూటికి నూరు శాతం సాధించాలన్నారు. జిల్లాలలో డొమెస్టిక్ సిలిండర్ లకు ఎలాంటి కొరతలేదని వాణిజ్యపరమైన సిలిండర్లకు మాత్రమే కొరత ఉందన్నారు.
అందువల్ల ప్రజలు దళారీల మాటలు నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లను అక్రమంగా కమర్షియల్ కు వాడిన 16 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. అనంతరం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారులందరూ కలిసికట్టుగా పనిచేసి మిర్యాల గూడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ చైర్మన్ సుధా, మున్సిపల్ కమిషనర్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




