18 May, 2026 | 1:05 AM

‘పొగ’చూరుతున్న నల్లగొండ!

18-05-2026 12:08 AM
  1. డంపింగ్ యార్డా? డెత్ చాంబరా?                       
  2. విషవాయువుల కోరల్లో.. చందనపల్లి పరిసర ప్రాంత వాసులు
  3. ముంచుకొస్తున్న అనారోగ్యం
  4. ఉదయసముద్రానికి పొంచి ఉన్న ముప్పు

నల్లగొండ/ కట్టంగూరు, మే 17 (విజయక్రాంతి): నల్లగొండ-చందనపల్లి రహదారిపై తెల్లవారుజామున వెళుతుంటే రోడ్డంతా మసకబారుతుంది. అలా అని చెప్పి మంచు ప్రభావం అనుకుంటే పొరబాటే. మానవ తప్పిదాలతో పుట్టిన విషవాయువులతో మిళితమైన పొగ అధి. అసలు అక్కడ కనిపిన్ జీ పరిస్థితి చూస్తుంట ఇది నివాస ప్రాంతమా లేక గ్యాస్ తో నిండిన చాంబరా అనే అనుమానం కలగక మానదు.

ఓవైపు కోట్లాది రూపాయలతో స్వచ్ఛ భారత్ నినాదాలు.. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా టన్నుల కొద్దీ వ్యర్థాల దహనం! ఇదంతా చూస్తుంటే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధునిక వ్యర్థాల నిర్వహణ అనేది కేవలం కాగితాలకే పరిమితమనిపిస్తోంది. బయో-మైనింగ్ లేదు, రీసైక్లింగ్ జాడ లేదు.. కేవలం చెత్తకు నిప్పు పెట్టడమే పరిష్కారమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అధికారులు అని స్థానికులు బాహాటంగానే చెబుతుండటం గమనార్హం. 660 గ్రామాలకు దాహం తీర్చే ఉదయ సముద్రం కలుషితమై హృదయ విదారక సంద్రంగా   మారిందని స్థానికులు చెబుతున్నారు.

కనిపించని దారి.. 

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ నుండి నిత్యం సేకరిస్తున్న వ్యర్థాలు ఇప్పుడు చందనపల్లి వాసుల పాలిట యమపాశంగా మారాయి. నిబంధనల ప్రకారం చెత్తను రీసైక్లింగ్ చేయాల్సింది పోయి.. గుట్టలుగా పోసి తగలబెడుతుండటంతో కిలోమీటర్ల మేర విషపూరిత పొగ కమ్మేస్తోంది. దీంతో అడుగు దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించని పరిస్థితి. రహదారి పొగతో నిండిపోవడంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.

మసకబారిన రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక చందనపల్లి, కాజీరామారం, శేషమ్మగూడెం ప్రజల పరిస్థితి వర్ణనాతీతం. తెల్లవారుజామున స్వచ్ఛమైన గాలి పీల్చాల్సిన చోట.. కుళ్లిన మాంసం, రసాయనాల పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా స్కూలుకు వెళ్లే చిన్నారులు, ఉద్యోగులు ఈ కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. ‘పిల్లలు దగ్గుతూ, కళ్లు మంటలతో నలుస్తూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇది డంపింగ్ యార్డా లేక డెత్ చాంబరా? అని స్థానికులు అధికారులను నిలదీస్తున్నారు.

ఉదయ సముద్రానికి పొంచిన ముప్పు..

ఈ సమస్య ఆ రోడ్డు ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కాదు  నల్లగొండ జిల్లాకే తలమానికమై సుమారు 660 గ్రామాలకు తాగునీటిని అందించే ఉదయ సముద్రం (పానగల్) చెరువుకు ముప్పు పొంచి ఉందని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ కారణంగా ఉదయ సముద్రం లోని నీరు కలుషితమవుతోంది. గాలికి ఎగిరి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్ళిన మాంసపు వ్యర్థాల నుంచి వెలువడే రసాయనాలు నేరుగా చెరువు నీటిలో కలుస్తున్నాయి.

దశాబ్ద కాలంగా నిబంధనల ప్రకారం చెత్తను వేరు చేయకపోవడం, రీసైక్లింగ్ ప్రక్రియ పట్టాలెక్కకపోవడం ఈ వినాశనానికి ప్రధాన కారణమనేది స్థానికుల నుండి వినిపిస్తున్న మాట. ఎన్నికల సమయంలో డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీలు గుప్పించే నాయకులు, గెలిచిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని స్థానికులు నిప్పులు చెరుగుతున్నారు. వ్యర్థాల శుద్ధి కోసం ప్రగల్భాలు పలికిన బయో మైనింగ్ ప్రక్రియ నేటికీ కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెత్తను శాస్త్రీయంగా నిర్వహించాల్సింది పోయి.. దానికి నిప్పు పెట్టడమే పరిష్కారమని అధికారులు భావించడం వారి పనితనానికి నిదర్శనమని పలు గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

పలువురికి చర్మ వ్యాధులు, కండ్ల కలకలు విపరీతంగా పెరుగుతున్నా.. వైద్య ఆరోగ్య శాఖ గానీ, మున్సిపల్ యంత్రాంగం గానీ స్పందించకపోవడం గమనార్హం. ఓ పక్క ’స్వచ్ఛ భారత్’ అంటూ నినాదాలు ఇస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇలాంటి ’విష సంస్కృతి’ కొనసాగుతుండడం విచారకరం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి చెత్తను కాల్చడం తక్షణమే నిలిపివేయాలనీ, నిలిచిపోయిన బయో మైనింగ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలనీ పలు గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.                

రోడ్డు కనిపించడం లేదు 

565 జాతీయ రహదారిపై వచ్చి పోయే వాహనదారులకు డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న ఒక కారణంగా రోడ్డు ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో వాహన వేగాన్ని చాలా తగ్గించాల్సి వస్తుంది. అలా వేగం తగ్గించడంతో పొగ లోపలికి వెళ్లడం ఫలితంగా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. కుక్కలు అక్కడే ఉండి వాహనదారుల వెంట పడుతుండడంతో కిందపడి గాయాలైన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు తగిన తగిన చర్యలు చేపట్టి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.

- శివకుమార్, ప్రయాణికుడు