calender_icon.png 5 February, 2026 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ కల నెరవేరేనా?

05-02-2026 01:40:11 AM

ఆర్సీబీతో టైటిల్ పోరు

నాలుగోసారి ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్

రెండో టైటిల్‌పై బెంగళూరు గురి

కెప్టెన్సీలో అదరగొడుతున్న జెమీమా రోడ్రిగ్స్

తొలి సీజన్‌లో ఫైనల్..రెండో సీజన్ లో ఫైనల్..మూడో సీజన్ లోనూ ఫైనల్... కానీ ఢిల్లీ టైటిల్ కల మాత్రం నెరవేరడం లేదు. ఇప్పుడు నాలుగోసారి కూడా ట్రోఫీకి అడుగుదూరంలో నిలిచింది. రెండుసార్లు ముంబై అడ్డుపడితే, మరోసారి ఆర్సీబీ దెబ్బకొట్టింది. మరి ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకుని ఢిల్లీ తన తొలి టైటిల్ ముద్దాడుతుందా... లేక రెండోసారి ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందా

వడోదర, ఫిబ్రవరి ౪: మహిళల ప్రీమియర్ లీగ్  2026 సీజన్ తుది అంకానికి చేరింది. గురువారం జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. వరుసగా నాలుగోసారి ఫైనల్‌కు దూసుకొచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాగైనా ట్రోఫీ కలను నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది. 2024 సీజన్ లో తమను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయిన ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. మరోవైపు ఈ సీజన్ ఆరంభం నుంచీ అదరగొడుతున్న ఆర్సీబీ మరోసారి టైటిల్‌పై కన్నేసింది. నిజానికి ఆర్సీబీతో పోలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన కాస్త తడబాటుగానే సాగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీజన్‌ను వరుసగా రెండు ఓటములతో ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత పుంజుకుంది.

కొత్త కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ జట్టును అద్భుతంగా నడిపిస్తోంది. ముంబై, ఆర్సీబీ, యూపీ , గుజరాత్ జట్లపై కీలక సమయాల్లో సాధించిన విజయాలు ఢిల్లీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ప్రతీ సీజన్‌లో అదరగొడుతూ ఫైనల్ చేరుతున్నా తుది మెట్టుపై బోల్తా పడుతోన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ఫైనల్ ఫోబియాను అధిగ మించాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీ బ్యాటింగ్‌లో లారా వోల్వార్ట్ , లిజెల్లీ లీ, జెమీమా రోడ్రిగ్స్ , షెఫాలీ వర్మ కీలకంగా ఉన్నారు. ఈ సీజన్ ఢిల్లీ ఫైనల్ చేరడంలో వీరిదే కీలకపాత్ర. ఫైనల్లోనూ ఈ బ్యాటర్లు అదరగొడితే ఢిల్లీకి తిరుగుండదు. ముఖ్యం గా సౌతాఫ్రికా మాజీ ఓపెనర్ లిజెల్లీ లీ సూపర్ ఫామ్‌లో ఉంది. ఢిల్లీ తరపున రెండు హాఫ్ సెంచరీలతో 283 పరుగులు చేసి టాప్ స్కోర్ గా నిలిచింది.

అలాగే బౌలింగ్‌లో నందిని శర్మ, చినెల్లీ హెన్రీ, శ్రీచరణిపై అంచనాలున్నాయి. విండీస్‌కు చెందిన చినెల్లీ హెన్రీ 12 వికెట్లతో సత్తా చాటింది. అలాగే తొలి సీజన్‌లోనే నందిని శర్మ 16 వికెట్లతో అదరగొట్టింది. ఈ ఇద్దరినీ ఎదుర్కోవడం ఆర్సీబీ బ్యాటర్లకు సవాలే. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం సీజన్ ఆరంభం నుంచీ నిలకడగా రాణిస్తోంది. ఆజట్టు 8 మ్యాచ్‌లలో రెండింటి లోనే పరాజయం పాలవగా ఆరింటిలో గెలిచింది. స్మృతి మంధాన ఆర్సీబీకి ఎంత కీల కమైన ప్లేయరో అందరికీ తెలుసు. సారథిగానే కాకుండా వ్యక్తిగతంగానూ రాణిస్తోంది. సీజన్ మొత్తం మీద 290 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్న స్మృతి టైటిల్ పోరులో చెలరేగాలని ఎదురుచూస్తోంది.

ఆమెతో పాటు ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ కూడా దూకుడుగా ఆడుతోంది. ఇక బౌలింగ్ లో లారెన్ బెల్ సైతం ఆర్సీబీకి కీలకంగా మారింది. 12 వికెట్లతో ఆర్సీబీ విజయాల్లో కీ రోల్ ప్లే చేసింది. డిక్లార్క్ , శ్రేయాంకా పాటిల్ కూడా రాణిస్తే ఢిల్లీ బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. ఇదిలా ఉంటే గత రికార్డుల్లో మాత్రం ఆర్సీబీపై ఢిల్లీదే పైచేయిగా ఉంది. 9 సార్లు తలపడితే ఆరు సార్లు ఢిల్లీనే గెలిచింది. ఈ సీజన్ లో రెండుసార్లు తలపడితే చెరొక మ్యాచ్ గెలిచాయి. మొత్తం మీద రెండోసారి టైటిల్ పై ఆర్సీబీ కన్నేస్తే.. తొలిసారి ట్రోఫీని అందుకునేందుకు ఢిల్లీ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

పిచ్ రిపోర్ట్ :

వడోదర బీసీఏ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బ్లాక్ సాయిల్ పిచ్ కావడంతో బ్యాటర్లు పండగ చేసుకోవచ్చు. టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. మంచు ప్రభావం కూడా ఉండడంతో ఛేజింగ్ జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది.

తుది జట్లు అంచనా :

బెంగళూరు : స్మృతి మంధాన(కెప్టెన్), గ్రేస్ హ్యారిస్, జార్జియా వాల్ , రిఛా ఘోష్ ( వికెట్ కీపర్ ), రాధా యాదవ్ . పూజా వస్త్రాకర్, డి క్లార్క్ , అరుంధతి రెడ్డి, సయాలీ సత్ఘరే, శ్రేయాంకా పాటిల్, లారెన్ బెల్

ఢిల్లీ : షెఫాలీ వర్మ, లారా వాల్వార్ట్ , లిజెల్లీ లీ( వికెట్ కీపర్ ), జెమీమా రోడ్రిగ్స్ (కెప్టెన్) , మారిజన్నే కాప్, నికీ ప్రసాద్, చినెల్లీ హెన్రీ, స్నేహా రాణా, మిన్ను మణి, శ్రీచరణి, నందిని శర్మ