గ్రీష్మకాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
కామారెడ్డి అర్బన్ మే13 (విజయక్రాంతి): వేసవి కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు డా రాగ సుధ సూచిస్తున్నారు. ఆయుర్వేదంలో గ్రీష్మ ఋతువులో పాటించాల్సిన ఆహార, విహార నియమాలను స్పష్టంగా వివరించారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రీష్మ ఋతువులో వాత దోషం అధికమవుతుందని, శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని పేర్కొన్నారు. అందువల్ల శరీరానికి చలువనిచ్చే ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. కీరదోస, దోసకాయ, సోరకాయ, పుచ్చకాయ, నిమ్మరసం, షర్బత్, నన్నారి, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావ వంటి పానీయాలు, తీపి పదార్థాలు తీసుకోవడం మంచిదన్నారు. వేసవిలో చెమట ద్వారా శరీరంలోని నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోతుండటంతో ఎక్కువగా నీరు తాగాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎండలో బయటకు వెళ్లకుండా ఉండాలని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, తడి గుడ్డ వంటి రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి, శరీరంపై చల్లటి నీరు చల్లాలని లేదా తడి గుడ్డతో తుడవాలని సూచించారు. బాధితుడు స్పృహలో ఉంటే నీరు, నిమ్మరసం లేదా ఓఆర్‌ఎస్ ద్రావణం ఇవ్వాలని తెలిపారు. శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని దోమకొండ ఆయుర్వేద వైద్య నిపుణులు ౄr రాగ సుధ మండల ప్రజలకు సూచించారు.






