7 July, 2026 | 1:00 AM

హక్కులు సాధించే వరకు పోరాటం ఆగదు

07-07-2026 12:06 AM

టీయూవీ చైర్మన్ సత్యనారాయణ

మంచిర్యాల అగ్రికల్చర్, జూలై 6 : తెలంగాణ ఉద్యమకారుల హక్కులు సాధించే వరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) వ్యవస్థాపక అధ్యక్షులు, చైర్మన్ నరాల సత్యనారాయ ణ పేర్కొన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ సంఘ భవనంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, కన్నీళ్లు, పోరాటాల ఫలితమని, అలాంటి మహోన్నత త్యాగాలను గౌరవించడం ప్రతి ప్రభుత్వ నైతిక బాధ్యత అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారుల త్యాగాల పునాదులపై నిర్మితమైందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు, రైతులు, కళాకారులు, మేధావులు అనేక కష్టనష్టాలను భరించి, జైలు శిక్షలు అనుభవించి, లాఠీ దెబ్బలు తిని, ఉద్యోగాలు కోల్పోయి, కొందరు ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. అలాంటి ఉద్యమకారులను విస్మరించడం తెలంగాణ చరిత్రను అవమానించినట్లేనని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి ఎన్నో సంవత్సరాలు గడిచినా వేలాది మంది నిజమైన ఉద్యమకారులు ప్రభుత్వ గుర్తింపునకు, సంక్షేమ పథకాలకు దూరంగా ఉండటం దురదృష్టకరమన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడిని పారదర్శకంగా గుర్తించి వారికి గౌరవం, గుర్తింపు, సంక్షేమం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, అమరవీరుల కుటుంబాలకు సంపూర్ణ భరోసా కల్పించాలని, ఉద్యమకారుల సమస్యలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ ఉద్యమకారుల వేదిక పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేశం ఆధ్వర్యంలో, ఉద్యోగఉపాధ్యాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాసాడి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దపల్లి కిషన్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేశెట్టి సంతోష్ కుమార్ (అభినవ), పల్లె భూమేష్, మహిళా విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు అత్తి సరోజ, రాష్ట్ర కార్యదర్శి బోప్ప అర్జయ్య, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడ సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల ధర్మేందర్,

కార్యదర్శి తుంగపెల్లి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు మద్దిబోయిన అర్జున్, కమ్మరి లింగయ్య, మచ్చ రాజేష్, అచ్చ భాగ్యలక్ష్మి, జిల్లా నాయకులు దొమ్మటి సత్తయ్య, చేను తిరుపతి, సోహెల్ ఖాన్, బండ రమేష్, మహిళా నాయకురాళ్లు బండి పద్మ, బొడ్డు రాజ్యలక్ష్మి, గొలుసుల వినోద, మేడి భూదేవి, బూట్ల వెంకటలక్ష్మి, మడావి పార్వతి తదితరులు పాల్గొన్నారు.