శ్రీ విజయ చందర్ రైస్ ఇండస్ట్రీస్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు వినతి
గరిడేపల్లి, జూలై 6 : మండల సరిహద్దు గ్రామమైన రాయినిగూడెం, హుజూర్ నగర్ మండలాల సరిహద్దులో జాతీయ రహదారి 167కు ఆనుకొని నిర్మించబడిన శ్రీ విజయ్ చందర్ రైస్ ఇండస్ట్రీస్ నిబంధనలను సక్రమంగా పాటించకుండా, ఎటువంటి రక్షణ పద్ధతులను ఆచరించకుండా నడుపుతున్నారని కావున మిల్లు, యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ లో జరుగుతున్న ప్రజావాణిలో పలువురు మండల వాసులు ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ జాతీయ రహదారి 167 ను ఆనుకొని ఉన్న శ్రీ విజయ్ చందర్ రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం సరియగు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారన్నారు. పలు రకాల పనుల నిత్య ఆ మార్గం గుండా వెళ్లే క్రమంలో ఆ రైస్ మిల్ నుండి వెలువడే వరిపొట్టు, దుమ్ము, ధూళి కళ్ళల్లో పడడంతో చాలా ప్రమాదాలు సంభవించాయన్నారు.
ఈ కారణం చేతనే గత సంవత్సరం జూన్ నెలలో ఓ మండల వాసి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన సందర్భం ఉందన్నారు. అదేవిధంగా గడిచిన జూన్ నెలలో మిల్లు యాజమాన్యం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, ఎటువంటి జాగ్రత్తలు లేకుండా మిల్లు పై ఏర్పాటు చేసిన సుమారు 15 రేకులతో కూడిన ఇనుప కడ్డీలు జారీ వచ్చి రోడ్డు మీద ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఎన్. సైదయ్య పై పడడంతో ఆయనకు రెండు కాళ్లు విపరీతంగా విరిగి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడన్నారు. ఇదే ఘటనలో మరో వ్యక్తికి కాలు విరగడంతో పాటు, ఇంకొకరి తలకు తీవ్ర గాయం అయిందన్నారు. అలాగే సుమారు 10 మందికి స్వల్ప గాయాలయ్యాయన్నారు.
అలాగే మిల్లు వ్యర్ధాలతో పక్కనున్న వాగు నీరు సైతం కలుషితమవుతుందన్నారు. ఇంత జరుగుతున్నా రెండేళ్లుగా మిల్లు నడుపుతున్న యాజమాన్యం కనీసం ప్రహరీ గోడ కూడా కట్టకపోవడం అత్యంత దారుణమన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మిల్లును పూర్తిస్థాయి పరిశీలనలు చేసి నిబంధనలు, సరియైన జాగ్రత్తలు పాటించని మిల్లు, దాని యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో మండల వాసులు జీ.ఎల్లయ్య, నన్నేసాహెబ్, పి.దాసు, రాము, బి.వీరయ్య, జీ.సైదులు, సత్యనారాయణ రెడ్డి, శేఖర్, రాంబాబు, రాజు తదితరులు ఉన్నారు.






