7 July, 2026 | 2:02 AM

ప్రభుత్వ పాఠశాలలకే విద్యార్థులను పంపించాలి

07-07-2026 12:59 AM

కన్కల్‌లో సర్పంచ్, గ్రామ పెద్దల తీర్మానం

తాడ్వాయి, జూలై 6 (విజయక్రాంతి): కన్కల్ గ్రామంలోని విద్యార్థులందరిని ప్రభుత్వ పాఠశాలలకే పంపించాలని గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి, గ్రామ పెద్దలు గ్రామస్తుల సమక్షంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం కన్కల్ గ్రామంలో సోమవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల,ఉన్నత పాఠశాలలకే కన్కల్ గ్రామంలోని విద్యార్థులను పంపిద్దామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, అవసరమైన సౌకర్యాలను సమకూర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్లను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

పాఠశాలలకు అవసరమైన మరింత సామాగ్రిని సమకూర్చడానికి తాను సాయశక్తుల కృషి చేస్తానన్నారు. పాఠశాలలో మరిన్ని సౌకర్యవంతమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు మాట్లాడుతూ... గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేద్దామని తెలిపారు. మన గ్రామం నుంచి ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థులను పంపిస్తే తల్లిదండ్రులకు అధిక ఆర్థిక భారం అవుతుందని వివరించారు.

ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వ పాఠశాలలకే విద్యార్థులను పంపించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలకే విద్యార్థులను పంపిద్దామని తెలిపారు.  అందరం కలిసికట్టుగా ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపుదామని తీర్మానించారు. అనంతరం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, డీఈఓ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహేందర్, దేమికలాన్ సింగిల్ విండో ఉపాధ్యక్షులు పులగం రవీందర్ రెడ్డి, మాజీ పాఠశాల చైర్మన్ మన్నే లక్ష్మి, గ్రామ పెద్దలు కిష్టారెడ్డి, వెంకట్ రెడ్డి, సంతోష్ రెడ్డి  పాల్గొన్నారు.