30 July, 2026 | 5:26 AM

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణను పారదర్శకంగా నిర్వహించాలి

30-07-2026 12:00 AM

అదనపు కలెక్టర్ హరిసింగ్

సూర్యాపేట, జూలై 29 (విజయక్రాంతి) :భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ’ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకగా, తప్పుల్లేకుండా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి హరిసింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ల నమోదు మరియు సవరణ ప్రక్రియ వేగంగా సాగుతోందని తెలిపారు.

షెడ్యూల్ ప్రకారం జూలై 24తో ముగియాల్సిన బీఎల్‌ఓల ఇంటింటి సర్వే గడువును, క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన ప్రకటించారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ 100 శాతం పూర్తయిందని, సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్ చేసే డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రస్తుతం 98.77 శాతానికి చేరుకుందని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం, చనిపోయిన వారి పేర్లు అలాగే ఉండటం వంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలోబీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను ధ్రువీకరించు కోవాలన్నారు.

2026 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈ సమీక్షలో కొత్త పోలింగ్ స్టేషన్ల పై చర్చ జరిగింది. 1200 ఓటర్లు దాటితే కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు పై చర్చించారు.

జిల్లాలోని ఓటర్లు తమ ఓటు హక్కును సరిచూసుకోవాలని, బీఎల్‌ఓలు ప్రతి రాజకీయ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకుని, ఓటర్ల జాబితా ప్రక్షాళనలో అధికారులకు సహకరించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ ప్రేమ్ రాజ్, కాంగ్రెస్ నుండి సిహెచ్ రాజేశ్వరరావు,బి జె పి నుండి చల్లమల్ల నరసింహ, ఎండి హాబిద్, బి ఎస్ పి నుండి ఎం.స్టాలిన్, బిఆర్‌ఎస్ నుండి ఎస్.సత్యనారాయణ, కరుణాకర్ రెడ్డి, సిపిఎం నుండి కోట గోపి, వైఎస్‌ఆర్సిపి నుండి బి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.