హామీలు నెరవేర్చని రేవంత్‌పై ప్రజలే క్షుద్ర పూజలు చేస్తారు
గజ్వేల్‌లో విలేకరుల సమావేశంలో వంటేరు ప్రతాప్ రెడ్డి
గజ్వేల్, ఆగస్టు 5 (విజయక్రాంతి) : ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందని, వారి దృష్టి మళ్లించేందుకే మాజీ మంత్రి హరీష్ రావుపై అనైతిక ఆరోపణలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. గజ్వేల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాలు లేకపోవడానికి ఎల్నీనో ప్రభావమే కారణమని గతంలో సీఎం, మంత్రులే చెప్పారని, ఇప్పుడు హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నాడని చెప్పడం వారి చేతగానితనానికి నిదర్శనమన్నారు. డైవర్షన్ రాజకీయాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్యగా మారాయని విమర్శించారు.
30 నెలల పాలనలో ప్రభుత్వం ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని, ఎస్‌ఎల్పీసీ పనులు ముందుకు సాగలేదని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం అదే ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎలా అందుతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని, హామీలు నెరవేర్చకపోతే సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తారని అన్నారు. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలకు సీఎం, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు రవీందర్, నర్సింగరావు, బొగ్గుల సురేష్, నవాజ్ మీరా, కౌన్సిలర్లు మురళి, బాపురాజు, మధు, స్వామి తదితరులు పాల్గొన్నారు.






