29 May, 2026 | 4:40 AM

ఎన్‌టీఆర్ చేసిన సేవలు ఎనలేనివి

29-05-2026 02:07 AM

నారా బ్రహ్మణి

బంజారాహిల్స్, మే 28(విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఆవరణలో ఘనంగా నిర్వ హించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా బ్రాహ్మణి..

ఆసుపత్రి ప్రాంగణంలోని స్వర్గీయ నందమూరి బసవతారకం, తారక రామారావు దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ, చిన్నపిల్లల వార్డులలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారికి పండ్లను పంపిణీ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా రోగులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు, కోరిన సహాయంపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని, వైద్య సిబ్బందిని ఆమె ఆదేశించారు.

ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ముఖ్య మంత్రిగా ఎన్టీఆర్ సమాజానికి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఆయన ఆశయాలకు, కలలకు అనుగుణంగానే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని నడుపుతున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ ఆసుపత్రి సేవలను మరింత విస్తరించి పేద రోగులందరికీ మెరుగైన చికిత్స అందేలా ముందుకు సాగుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడు జె.యస్.ఆర్. ప్రసాద్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి.యస్. రావుతో పాటు పలువురు వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ఆశయాలే ప్రజాసేవకు స్ఫూర్తి: మల్లంపాటి రాహుల్ 

శేరిలింగంపల్లి మే 28 (విజయక్రాంతి): విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు గురువారం రంగారెడ్డి జిల్లా మదీనాగూడలోని దీప్తి శ్రీనగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. మల్లంపాటి రాహుల్ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు జాతికే గర్వ కారణం, ప్రజాసేవకు కొత్త దారులు చూపించిన మహానేతగా ఆయన చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. యువత ఎన్టీఆర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ను యుగపురుషుడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం: బండి రమేష్ 

కూకట్ పల్లి, మే 28,( విజయ క్రాంతి): తెలుగు జాతి పౌరుషాన్ని దశదిశలా వ్యాపింపజేసిన నందమూరి తారక రామారావు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అని కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 103 వ  జయంతి వేడుకలను గురువారం కూకట్పల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధి వసంత నగర్ లో నిర్వహించిన జయంతి వేడుకలకు అతిథిగా హాజరై బండి రమేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎన్టి ఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.