రావు బహదూర్ డ్యాన్సులు నా కెరీర్‌లో ప్రత్యేకం
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నమ్రతా శిరోద్కర్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘రావు బహదూర్’. ప్రముఖ దర్శకుడు వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యదేవ్ కథానాయకుడు. ఈ సైకాలజికల్ థ్రిల్లర్‌కు వెంకటేశ్ మహా దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాతలు.
ఈ చిత్రంలో దీపా థామస్ కథానాయికగా నటిస్తుండగా.. వికాస్ ముప్పాల, బాల పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం చిత్రబృందం రెండో పాట ‘దేశ సంచారి’ని విడుదల చేసింది. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. “-అందరికీ డ్యాన్స్ విషయంలో ఈ ఒక పాటే కనిపిస్తుంది. కానీ ఇందులో ఇంకో రెండు పాటలు ఉన్నాయి.
నా కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ ఈ స్థాయిలో డ్యాన్సులు చేశా. ఇది సాల్సా స్టయిల్ డ్యాన్స్. నిజానికి ఇలాంటి డ్యాన్స్ చేయాలంటే పది, పదిహేనేళ్ల ప్రాక్టీస్ కావాలి. నాకు ఎంతో ఓపికగా నేర్పించి చేయించిన మా డాన్స్ మాస్టర్‌కు థాంక్యూ. -ఈ పాట చేసినప్పుడు నా కండరాలు, వెన్నుపూస కూడా కొంచెం దెబ్బతిన్నాయి (నవ్వుతూ). కానీ ఫైనల్‌గా పాట చాలా అద్భుతంగా వచ్చింది. -ఈ పాటకు ‘దేశ సంచారి’ అనే లైన్ చాలా చక్కగా కుదిరింది. ఇదే సమయంలో మహేశ్‌బాబు ‘వారణాసి’ సినిమాలో కూడా ‘సంచారి’ అనే పాట ఉండటం యాదృచ్ఛికంగా జరిగిందని భావిస్తున్నా. -ఈ సినిమాలో మొత్తం ఏడు గెటప్స్ ఉన్నాయి.
అందులో నాకు చాలా ఇష్టమైనది రామప్ప గెటప్” అని తెలిపారు. దర్శకుడు వెంకటేశ్ మహా మాట్లాడుతూ.. “కమల్ హాసన్ ఒకసారి తన రిటైర్మెంట్ గురించి చెప్తూ, ‘నా తర్వాతి తరంలో నాలా పెర్ఫార్మ్ చేసే నటుడు కనిపిస్తే నేను రిటైర్ అవుతా’ అన్నారు. ఆయన మనందరికీ స్ఫూర్తి. ఆయన ఎప్పటికీ రిటైర్ కాకూడదు. కానీ ఆయన స్థాయిలో పెర్ఫార్మ్ చేసే నటుడు మా తరానికి దొరికాడు. ఆయనే సత్యదేవ్. ఈ సినిమాతో సత్య అది ఎచీవ్ చేశాడు” అని చెప్పారు. ‘ప్రేక్షకులకు ఈ సినిమా ఒక కొత్త అనుభవం అవుతుంద’ని నిర్మాత అనురాగ్ చెప్పారు.






