శ్రుతి కుదిరింది!
స్టార్ హీరో రామ్‌చరణ్ నటిస్తున్న తాజాచిత్రం ‘పెద్ది’. జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఉప్పెన’ వంటి మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం, ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యం వహిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ విషయంలోనూ సినీప్రియుల్లో అంతే ఆసక్తి ఏర్పడింది.
ఈ ప్రత్యేక గీతంలో నటించే హీరోయిన్ ఎవరు అనే విషయమై చాలా రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పాటలో చరణ్‌తో ఆడిపాడే బ్యూటీ అంటూ ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్, సమంత, పూజా హెగ్డే, సంయుక్త మీనన్, మానస వారణాసి వంటి హీరోయిన్ల పేర్లను వినిపించాయి. అయితే, మేకర్స్ చివరకు టాలీవుడ్ గ్లామర్ డాల్ శ్రుతి హాసన్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. రామ్‌చరణ్ మాస్ ఇమేజ్‌కు, ఏఆర్ రెహమాన్ ఇచ్చే ఊపున్న ట్యూన్‌కు శ్రుతి అయితేనే కరెక్ట్ అని చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
శ్రుతి హాసన్‌కు స్పెషల్ సాంగ్స్ కొత్తేమీ కాదు. గతంలో మహేశ్‌బాబు ‘ఆగడు’, నాని ‘హాయ్ నాన్న’ చిత్రాల్లో తన స్పెషల్ అప్పియరెన్స్‌తో మెప్పించిందీ ముద్దుగుమ్మ. రామ్‌చరణ్‌తోనూ ఇంతకుముందు ‘ఎవడు’ సినిమాలోని ‘పింపుల్ డింపుల్’ సాంగ్‌లో ఆడిపాడింది శ్రుతి. ఆ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ, డ్యాన్స్ మూమెంట్స్ థియేటర్లలో ఈలలు వేయించాయి. ఇప్పుడు దాదాపు పుష్కర కాలం తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషం.






