24 April, 2026 | 1:41 AM

ఈసారి గవర్నర్‌తో వస్తోంది

24-04-2026 12:12 AM

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అదా శర్మ ‘ది కేరళ స్టోరీ’తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాదు వివాదాలనూ అదే స్థాయిలో ఎదుర్కొంది. తాజా గా ఈ ముద్దుగుమ్మ తన కొత్త ప్రాజెక్టు ‘గవర్నర్: ది సైలెంట్ సేవియర్’ను ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ది కేరళ స్టోరీ’ నిర్మాత విపుల్ అమృత్ లాల్ షాతో కలిసి అదా చేస్తున్న మూడో ప్రాజెక్టు ఇది. ఇక ఇందులో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

చిన్మయ్ దీపక్ మాండ్లేకర్ దర్శకత్వంలో సన్‌షైన్ పిక్చర్స్ పతా కంపై విపుల్ అమృత్ లాల్ షా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం మనోజ్ బాజ్‌పేయి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. విడుదలైన రెండు పోస్టర్లు ఎంతో ఇంటెన్సివ్ ఉన్నాయి. అదా శర్మ కూడా ఈ మూవీ పోస్టర్లను పంచుకుంటూ.. “ఈరోజు మనం ప్రపంచ శక్తిగా నిలిచామంటే, దానికి కారణం ఒక అజ్ఞాత వీరుడు సాగించిన అప్రకటిత యుద్ధమే’ అని పేర్కొంది.

అంటే దేశరక్షణ కోసం తెరవెనుక ఉండి పోరాడే అధికారి కథగా ఇది ఉండబోతోందని అర్థమవుతోంది. ‘నేను విఫలమైతే భారతదేశం విఫలమవుతుంది’ అనే మరో వ్యాఖ్య చూస్తుంటే ఇది ఒక సాధారణ రాజకీయ డ్రామా మాత్రమే కాదు, ఒక గొప్ప మానవీయ కోణమున్న కథ అని స్పష్టమవుతోంది.

ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా, ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ పాటలు రాస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదా ప్రస్తుతం ‘సూపర్ వెల్లి’, ‘హాటక్’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ‘గవర్నర్’ ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమాననులు భావిస్తున్నారు.