24 April, 2026 | 1:33 AM

పేరే బ్రూటల్ ధర్మ.. కానీ, ఇది నవ్వించే పాత్ర

24-04-2026 12:20 AM

తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజాచిత్రం ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంథిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్‌కృష్ణ లింగమనేని, ఉమేశ్ బన్సాల్ నిర్మించారు. రైటర్ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలు. జేడీ చక్రవర్తి ‘బ్రూటల్ ధర్మ’ అనే పాత్రను పోషించారు. మే 1న విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను జేడీ చక్రవర్తి విలేకరులతో పంచుకున్నారు. 

* క్యారెక్టర్ ఆర్క్‌లో చాలెంజ్ ఉంటే ఏ నటుడికైనా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. కమల్‌హాసన్ చేసిన క్యారెక్టర్లు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. అయితే యాక్టర్‌గా కాదు, పాత్రపరంగా ఆయనకు రాని అదృష్టం నాకు ఈ చిత్రం ద్వారా వచ్చింది. పాత్ర పేరు ‘బ్రూటల్ ధర్మ’. కానీ నేను స్క్రీన్‌పై చేసే పనులు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తాయి. ఒకే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో ఒక షేడ్, సెకండ్ హాఫ్‌లో మరో షేడ్ ఉండటం మామూలే. కానీ ఒకేలా అనిపిస్తూ, రెండు షేడ్స్‌లో కనిపించడం నన్ను చాలా ఎక్సైట్ చేసింది.  

* ఇది డైరెక్టర్స్ ఫిల్మ్. ఇందులో నేను, తరుణ్ భాస్కర్, పవన్ సాదినేని లాంటి డైరెక్టర్స్ ఉన్నాం. మేము ఇన్‌పుట్స్ ఇవ్వలేదు. కశ్యప్ తాను అనుకున్నట్లే తీశాడు. 

* కథ వర్క్ అవుట్ అయితేనే సినిమా ఆడుతుంది. ‘శివ’లో నా క్యారెక్టర్ పేరే ఇప్పుడు ఇండస్ట్రీలో నా పేరుగా మారిపోయింది. చక్రవర్తి అంటే గుర్తుపట్టరు, జేడీ చక్రవర్తి అంటేనే గుర్తుపడతారు. అలాగే భవాని, సత్య, భీకు మాత్రే, కల్లుమామ.. ఇలా చాలా పాత్రలు గుర్తుండి పోయాయి. కానీ కథ వర్క్ అవుట్ కాకపోతే క్యారెక్టర్లు నిలవవు. ఒకవేళ నిలిచినా.. సినిమా ఆడదు. నా కెరీర్‌లో ఫేవరెట్ క్యారెక్టర్ ‘వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్’. ఆ పాత్ర వర్క్ అవుట్ అయ్యింది. కానీ సినిమా ఆడలేదు. 

* గాయపడ్డ సింహం’లో మొదటి సింహం.. తరుణ్ భాస్కర్ గాయపడ్డాడు, నేను రెండో సింహం.. నేనూ గాయపడ్డాను, ఇంకో సింహమూ గాయపడింది. ఆ సింహాన్ని త్వరలో రివీల్ చేస్తాం. సినిమాలో నా క్యారెక్టర్, తరుణ్ భాస్కర్ చేసిన దరహాస్, ఇంకో పాత్ర.. ఇవన్నీ కలిసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డైరెక్టర్  రియలిస్టిక్, హిలేరియస్ హ్యూ మర్‌తో సినిమా తీశాడు. 

* నా కెరీర్‌లో మొదటి నుంచి నెమ్మదిగానే చేస్తున్నా. ఎప్పుడూ గబగబా సినిమాలు చేయలేదు. కథ నచ్చితేనే చేస్తా. ఈ కథ కూడా అలానే ఒప్పుకున్నా. 

* నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. హీరో, విలన్ అని బేరీజు వేసుకోను. కథ కొత్తగా ఉంటే చేయాలనిపిస్తుంది. ఎక్స్‌పెరిమెంట ల్ సినిమాలు కూడా కచ్చితంగా చేస్తా. 

* ఓటీటీ వల్ల మంచి కంటెంట్ వస్తోంది. ఇప్పుడు థియేటర్లలో సినిమా ఆడాలంటే కచ్చితంగా మంచి కంటెంట్ ఉండాలి. ఎందుకంటే ప్రేక్షకులకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. సినిమా నచ్చకపోతే థియేటర్లలోనే కాదు, ఓటీటీలోనూ చూడరు. కానీ నచ్చితే మాత్రం ఓటీటీ వరకూ ఆగరు వెంటనే థియేటర్‌కు వెళ్లి చూస్తారు. అదే మనిషి నైజం.