19 June, 2026 | 2:03 AM

వచ్చేశాడు కొత్త స్పీడ్‌స్టార్

19-06-2026 01:07 AM

నయా పేస్ గుర్రం గుర్నూర్

దేశవాళీ క్రికెట్ ప్రతిభతోనే గుర్తింపు

భారత్ పేస్ కష్టాలు తీరినట్టే

భారత క్రికెట్‌లో పేస్ విభాగం బలహీనత ఇప్పుడున్నది కాదు. దిగ్గజాలు ఒక్కొక్కరుగా రిటైరవుతూ కొత్త బౌలర్లు వచ్చినా ఎక్కడో ఆ లోటు స్పష్టంగానే కనిపిస్తుంటుంది. బుమ్రాతో పేస్ లోటు భర్తీ కొంత జరిగినా ఆ తర్వాత ఎవరు అనేది మాత్రం జవాబు దొరకడం లేదు. జట్టులో ఉన్న ఇద్దరు ముగ్గురు పేసర్లు నిలకడగా రాణించలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ జట్టులోకి కొత్త పేస్‌గుర్రం వచ్చింది. అతడే గుర్నూర్ బ్రార్...అరంగేట్రంలోనే ఆకట్టుకున్న ఈ పంజాబీ పేసర్ టీమిండియా పేస్‌ను సుదీర్ఘంగా నడిపించగలడా?

చెన్నై, జూన్ 18 : భారత జట్టుకు మరో స్పీడ్ స్టార్ దొరికాడు. దేశవాళీ క్రికెట్‌లో ప్రతిభ కనబరిచి ఆ ప్రదర్శనలతోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తొలి మ్యాచ్ నుంచే బుల్లెట్ లాంటి బంతుతో ప్రత్యర్ధి బ్యాటర్లకు వణుకు పుట్టిస్తున్నాడు.

అతడే టీమిండియా నయా పేస్ గుర్రం గుర్నూర్ బ్రార్. పంజాబ్‌కు చెందిన  ఈ పొడగరి పేసర్ ఇటీవల అఫ్గానిస్తాన్‌పై  అంతర్జాతీ య అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. తర్వాత రెండో వన్డేలోనూ రాణించాడు. మరోసారి 3 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టాడు. దీంతో తన కెరీర్‌లోని మొదటి రెండు వన్డేల తర్వాత భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్‌లో గుర్నూర్ బ్రార్ చేరిపోయాడు. దీంతో బ్రార్ బౌలింగ్ ప్రతిభపై చర్చ జరుగుతోంది.

పలువురు మాజీలు ఈ యువ పేసర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.  ప్రస్తుతం భారత్ అన్ని ఫార్మాట్లలో ఎక్కువగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడుతోంది. అతడికి సపోర్ట్‌గా మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ వంటి పేసర్లు ఉన్నారు. వీరు ముగ్గురు తప్ప ప్రస్తుతం భారత జట్టులో నిలకడగా రాణించే మరొక ఫాస్ట్ బౌలర్ ఎవ్వరూ కనిపించడం లేదు. అప్పుడప్పుడూ వీరు కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు.

అయితే ఇప్పుడు గుర్నూర్ రాకతో భారత్ పేస్ ఎటాక్ బలం పెరిగిందని భావిస్తున్నారు. ఈ యువ పేసర్‌కు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ నైపుణ్యం ఉంది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేయగల సత్తా అతడి సొం తం. కొంతకాలంగా ఐపీఎల్‌లో సత్తా చాటి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్న ప్లేయర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. కానీ గుర్నూర్ మాత్రం దేశవాళీ క్రికెట్‌లో తన సత్తా చూపిం చి సెలక్టర్లను ఆకర్షించాడు. 

అవకాశాన్ని ఒడిసిపట్టుకుని..

గుర్నార్ బ్రార్ పంజాబ్ తరపున కేవలం 18 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. గతేడాది స్వదేశంలో ఆస్ట్రేలియా -ఎతో వన్డే సిరీస్ అతడి కెరీర్‌ను మలుపుతిప్పింది.ఆ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లలోనే 8 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత అతడికి భారత జట్టులో నెట్ బౌలర్‌గా అవకాశం దక్కింది.

ఇప్పుడు అఫ్గాన్‌తో వన్డే సిరీస్‌కు బుమ్రా, సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వడంతో గుర్నూర్‌కు చోటు దక్కింది. తనకు లభించిన అవకాశాన్ని చక్కగా ఒడిసిపట్టుకుని అదుర్స్ అనిపించాడు. 2023లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటికి ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్-2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్నాడు.  కానీ గత మూడు సీజన్లలోనూ  తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. 2024 నుండి ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

  ఐపీఎల్ 2026 సీజన్ ముగిసేవరకు కూడా అతనికి గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఆడే అవకాశం రాలే దు. అయితే గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశి ష్ నెహ్రా వంటి దిగ్గజ పేసర్ పర్యవేక్షణలో అత డు రాటు దేలాడు. దేశవాళీ క్రికెట్‌లో రాణించడమే తన కెరీర్‌కు కీలకమైందని బ్రార్ చెబు తున్నాడు. విదేశీ పిచ్‌లపై అవకాశం దక్కితే అక్కడ కూడా చెలరేగేందుకు ఎదురుచూస్తున్న గుర్నూర్ భవిష్యత్తులో టీమిండియా పేస్ ఎటాక్‌లో కీబౌలర్ కావడం ఖాయం.