కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ
- ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో సమావేశం
- పార్టీ బలోపేతం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యూహాలపై చర్చ
- ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అధినేత దిశానిర్దేశం
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్ర కేసీఆర్‌తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు గురువారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచర ణ, సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్టు సమాచారం.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత వేగవంతం చేయడం, పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించడం, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడం వంటి అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అలాగే రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతోపాటు ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేసే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజ కీయంగా దూకుడు పెంచుతూ, పార్టీ క్యాడర్ ను మళ్లీ చైతన్యపరిచే దిశగా రాబోయే రోజు ల్లో కార్యాచరణ చేపట్టాలని కేసీఆర్ సూచించినట్టు తెలుస్తున్నది.
ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్న నేపథ్యం లో జరిగిన ఈ సమావేశం బీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యం సంతరించుకున్నది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, పార్టీ పునర్వ్యవస్థీకరణ, క్షేత్రస్థాయి బలోపేతం వంటి అంశాలపై తీసుకోనున్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో పార్టీ రాజకీయ వ్యూహాన్ని నిర్దేశించే అవకాశం ఉందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.






