నేడు మహాశక్తి దేవాలయ షోడశ వార్షికోత్సవం
హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వార్షికోత్సవ వేడుకలు
వేడుకలకు హాజరుకానున్న కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్
ముకరంపురా, జూన్18 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో అత్యంత ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతు, కరీంనగర్ ప్రజల ఆరాధ్య దైవం, మహిమాన్విత శక్తి స్వరూపులైన మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లతో కొలువుదీరి భక్తుల పాలిట కొంగుబంగారంగా మారిన దివ్య పుణ్యక్షేత్రం మహాశక్తి దేవాలయ షోడశ (16వ) వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమైంది. 19 వ తేదీ శుక్రవారం రోజున జరగనున్న వార్షికోత్సవ వేడుకల కోసం ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది.
ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో అత్యంత వైభవంగా వేడుకలను, ప్రత్యేక పూజా కార్యక్రమాలను జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు విద్యారణ్య భారతి స్వామి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. వార్షికోత్సవ వేడుకలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నారు. వార్షికోత్సవం రోజైన శుక్రవారం (జూన్ 19) నాడు ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక విశేష పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించనున్నారు.ఉదయం 4:30 నిమిషాలకు జగద్గురువుల కరకమలములచే పూజలు ప్రారంభం కానున్నాయి.






