రైతు బీమాను ఎగ్గొట్టడానికి ప్రభుత్వం కుట్ర
- 7,600 మంది రైతుల మరణిస్తే ఇప్పటికీ ఇన్స్యూరెన్స్ రాలేదు
- మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): రైతు బీమా పథకాన్ని ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆయా కారణాలతో 7,600 మంది రైతుల మరణిస్తే వాళ్లకు రావాల్సిన ఇన్స్యూరెన్స్ డబ్బులు ఇప్పటికీ రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లించకపోవడం వల్లే రైతులకు బీమా డబ్బులు రాలేదన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు.
ధ్యానం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పెద్దపెద్ద ప్రకటనలు చేస్తున్నదని, కానీ ఆరుగాలం కష్టించి పండించిన రైతు ధాన్యాన్ని అడ్డికి పావుశేరులా అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్‌లో వైఎస్సార్, తెలంగాణ వచ్చిన తరువాత కేసీఆర్ రైతులకు అండగా నిలబడి రైతాంగాన్ని ఆదుకున్నారని గుర్తుచేశారు. ఎల్ నినో ప్రభావంతో రైతులు సాగులో ముం దుకు పోలేక పోతున్నారని, ఏడు రకాలను మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వం ప్రకటనలు ఇస్తున్నదన్నారు.
ధాన్యం సేకరణ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారని విమర్శించారు. యాసంగి సీజన్ బోనస్‌ను ప్రభుత్వం మర్చిపోయిందని, ఈ వానాకాలం సీజన్‌లోనైనా రైతుభరోసా రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. యూరియా యాప్ తనకే అర్థం కావడం లేదని, సాధారణ రైతుకు ఏం అర్థమవుతుందన్నారు.
మోదీ బడే బాయ్ అని చెప్పే రేవంత్‌రెడ్డి ధ్యానం కొనుగోలుపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ధాన్యం దోపిడీపై విచారణ చేయకపోతే ప్రభుత్వం కనుసన్నల్లో జరిగిందని భావించాల్సి వస్తుందన్నారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాయకుండా చూడాలన్నారు.






