19 June, 2026 | 3:23 AM

ఎడారిలా మానేరు!

19-06-2026 02:01 AM

చారిత్రక ఎగువ మానేరు -ప్రతిష్టాత్మక మిడ్ మానేరు.. రెండింటికీ నీటి కష్టాలు

జలాశయాల దుస్థితిపై సోషల్ మీడియా ఉద్యమం

సిరిసిల్ల/గంభీరావుపేట/బోయినిపల్లి, జూన్ 18 (విజయక్రాంతి): ఒకప్పుడు అలలతో కళకళలాడిన మిడ్ మానేరు, ఎగువ మానేరు జలాశయాలు ప్రస్తుతం నీటి జాడ లేక వెలవెలబోతున్నాయి. రైతాంగానికి సా గునీరు అందించడంలో కీలక పాత్ర పోషించిన ఈ రెండు జలాశయాల దుస్థితి స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. బోయినిపల్లి మండలంలోని మిడ్ మానేరు జలాశయం 25.87 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మితమై దాదాపు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

2019లో పూర్తిస్థాయి నీ టిమట్టానికి చేరుకున్న ఈ జలాశయం ప్రస్తుతం పూర్తిగా ఎండిపోయి అడుగుభాగం బయటపడింది. ఒకప్పుడు నీటిలో మునిగిపోయిన రహదారులు, భూములు ఇప్పుడు కనిపిస్తున్నాయి.మిడ్ మానేరు నిర్మాణం కోసం వేలాది కుటుంబాలు తమ ఇళ్లు, భూములను త్యాగం చేశాయి. అలాంటి జలాశయం ఖాళీగా కనిపించడం నిర్వాసితులను కలచివేస్తోంది. గంభీరావుపేట మండలం, నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

నిజాం కాలంలో నిర్మించిన ఈ జలాశయం 2.24 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండగా ప్రస్తుతం పూర్తిగా ఎండిపోయింది. భారీగా పూడిక పేరుకుపోవడం తో నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ప్రాజెక్టు ఆప్రాన్, కాలువలు, తూము షట్టర్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వేళ జలాశయాల్లో నీటి కొరత రైతుల్లో ఆందోళన పెంచుతోంది. సాగునీటితో పాటు భూగర్భ జలాలు, తాగునీటి వనరులపై కూ డా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పర్యావరణ వ్యవస్థ, జీవ వైవిధ్యంపై కూడా ముప్పు ఏర్పడుతోంది. ఎగువ మానేరు పరిరక్షణ కోసం స్థానిక యువత సోషల్ మీడియాలో ఉద్య మం చేపట్టి పూడిక తొలగింపు, మరమ్మతు పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. వర్షాలు సమృద్ధిగా కురవడం, గోదావరి జలాలు చేరడం, పునరుద్ధరణ చర్యలు చేపట్టడం ద్వారా మాత్రమే మిడ్ మానేరు, ఎగువ మానేరు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.