యుద్ధానికి ముగింపు
శాంతి ఒప్పందంపై అమెరికా-ఇరాన్ సంతకాలు
- 14 అంశాలతో డీల్
- స్వయంగా ధ్రువీకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- కాల్పుల విరమణ 60 రోజుల పొడిగింపు
- అన్ని వైపులా సైనిక చర్యల నిలిపివేత
- త్వరలో హోర్ముజ్ జలసంధి ఓపెన్!
- చారిత్రక ఒప్పందంపై ప్రపంచ దేశాల హర్షం
ప్యారిస్, జూన్ 18: పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన యుద్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. సైనిక ఉద్రిక్తతలకు తెరదించుతూ కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పం దంపై అమెరికా-ఇరాన్ దేశాలు సంతకాలు చేశాయి. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఫ్రాన్స్‌లోని వర్సైల్స్ ప్యాలెస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ డిజిటల్ విధానంలో సంతకాలు పూర్తి చేశారు.
జీ-7దేశాల అధినేతలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మా న్యుయేల్ మాక్రాన్ ఇచ్చిన విందు అనంత రం.. ట్రంప్ ఈ ఒప్పందాన్ని స్వయంగా ధ్రువీకరిస్తూ ‘సంతకం పూర్తయింది’ అని ప్రకటిం చారు. గత ఆదివారమే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘేర్ ఖాలిబాఫ్ వర్చువల్ విధానంలో ప్రాథమికంగా సంతకాలు చేయగా.. తాజాగా దేశాధినేతల తుది ఆమోదం లభించింది. మొత్తం 14 కీలక అంశాల ఆధారంగా ఈ శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ డీల్ ప్రకారం.. ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారు. లెబనాన్‌తో సహా అన్ని రంగాల్లో సైనిక చర్యలను ముగించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఇరుదేశాల ఘర్షణల వల్ల మూతపడిన హోర్ముజ్ జలసంధిని ఎలాంటి టోల్ ట్యాక్స్ లేకుండా తక్షణమే పునరుద్ధరించడానికి ఇరాన్ అంగీకరించింది.
ఆంక్షల సడలింపు
శాంతి ఒప్పందం ప్రకారం.. ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను సడలించి ఆర్థిక ఉపశమనం కలిగించడానికి మార్గం సుగమమైంది. ఇరాన్ చము రు, ఇంధన ఎగుమతులకు అడ్డంకులు తొలగిపోనున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా, ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను తగ్గించుకోవడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయ బోమని, కొనుగోలు చేయబోమని ఈ ఒప్పందంలో హామీ ఇచ్చింది.
కొన్ని నెలలుగా అమె రికా నావికా దళం విధించిన దిగ్బంధనం కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాల్లో మునిగిపోయిన ఇరాన్‌ను శాంతిమార్గంలోకి తీసుకురావడానికి పాకిస్థాన్, ఖతార్ దేశాలు ఈ చారిత్రక పరిణామానికి మధ్యవర్తిత్వం వహించాయి. ఈ మేరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ ఈ ‘ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం’ తక్షణమే అమలులోకి వచ్చిందని సామాజిక మాధ్యమాల్లో ‘ఎక్స్’ద్వారా ప్రకటించారు. ఇదరు దేశాల అధ్యక్షుల సంతకాలతో పాటు, మధ్యవర్తిగా తాను కూడా ఈ ఒప్పందాన్ని అమోదించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఒప్పందం ఉల్లంఘిస్తే చర్యలు
ఇరాన్ సర్వోన్నత నేత మొజ్తాబా ఖమేనీ మార్గదర్శకత్వంలో తమ జాతీయ ప్రయోజనాలకు భంగం కలగకుండా ఈ డీల్ కుదు ర్చుకున్నామని ఇరాన్ మీడియా పేర్కొంది. కాగా ఈ 60 రోజుల ఒప్పంద నిబంధనలను ఇరాన్ ఉల్లంఘిస్తే తిరిగి సైనిక చర్యలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. యద్ధం ముగి యడంపై ఐక్యరాజ్య సమితితో సహా భారత్, ఇతర దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మైలురాయిని పురస్కరించుకుని శుక్రవారం స్విట్జర్లాండ్‌లో అధికారిక సంతకాల వేడుక జరగనుంది. ఇదిలా ఉండగా ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి.
ఒప్పందంలోని 14 అంశాలు
* లెబనాన్ సహా అన్ని రంగాల్లో తక్షణమే యుద్ధం నిలిపివేయడం, పూర్తిస్థాయి శాశ్వత కాల్పులు విరమణ.
* ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని అమెరికా నిబద్ధత.
* 30 రోజుల్లోగా నేవీ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయడం.
* ఇరాన్ చుట్టుపక్కల అమెరికా తన దళాలను ఉపసంహరించడం.
* 30 రోజుల్లోగా హోర్ముజ్‌ని తెరవడం.
* చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, వాటి ఉత్పన్నాల అమ్మకంపై ఆంక్షలు తొలగించి, తద్వారా లభించే ఆర్థిక వనరులను ఇరాన్ పూర్తిగా వినియోగిం చుకునేలా చేయడం.
* అమెరికా, దాని మిత్రదేశాలు ఇరాన్ కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల విలువైన పునర్నిర్మాణ ప్రణాళికలను సమర్పించాలనే నిబంధన.
* అణు సమస్యలు, అమెరికా ప్రాథమిక, ద్వితీయ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయ డం, అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ గవర్నర్ల బోర్డు సంబంధిత తీర్మానాలపై దృష్టి సారించి, తుది ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే లక్ష్యంగా 60 రోజుల పాటు చర్చలు జరపాలి.
* అణు నిరాయుధీకరణ ఒప్పందం (ఎన్‌పీటీ) కింద అణ్వాయుధాలను ఉత్పత్తి చేయబోమని ఇరాన్ తన నిబద్ధతను పునరుద్ఘాటించడం.
* చర్చల కాలంలో ఈ ప్రాంతంలో తన సైనిక బలగాలను పెంచబోమని, ఎటువంటి కొత్త ఆంక్షలను విధించబోమని అమెరికా హామీ ఇస్తుంది.
* చర్చల కాలంలో స్తంభింపజేసిన 24 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం. ఈ మొత్తంలో సగం చర్చ లు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్‌కు అందుబాటులోకి తీసుకురావాలి.
* ఒప్పందం అమలును నిర్ధారించడానికి ఒక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం.
* తుది ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదిస్తారు.
* ఇరాన్ స్తంభింపజేసిన ఆస్తులలో సగం విడుదలయ్యే వరకు, చమురు ఆంక్షలు తొలగింపు, నేవీ దిగ్బంధనం ఎత్తివేసేవరకు తుది చర్చలు ప్రారంభం కావు. తుది ఒప్పందం ప్రత్యేకంగా ఈ అంశాలపై దృష్టి సారిస్తుంది.
బీబీ.. మీకు కావాల్సినదే దక్కింది: ట్రంప్
అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో ఇజ్రాయెల్‌కు ఇరాన్ నుంచి అణుదాడి ముప్పు తొలగిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం ప్ చెప్పారు. ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ తో ట్రంప్ మాట్లాడారు. ‘బీబీ (నెతన్యా హూ).. ఒకసారి ఆలోచించండి. మీరు కోరుకున్న అత్యంత ముఖ్యమైన అంశమిదే. ఇక మీ దేశంపై అణుబాంబు ముప్పు ఉండదు. ఇరాన్ ఒకే ఒక్క అణు బాంబును ఇజ్రాయెల్ మధ్యలో ప్రయోగించినా దేశం తీవ్ర ప్రమాదంలో పడేది.
ఇప్పు డు ఆ ప్రమాదం తొలగిపోయింది’ అని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంతో ఇజ్రాయెల్ సంతృప్తిగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా తీసుకున్న నిర్ణయాలు ఇజ్రాయెల్‌కు ఎన్నో ప్రయోజనా లు చేకూర్చాయని వెల్లడించారు. మరోవైపు.. లెబనాన్ నుంచి తమ దళాలను ఉపసంహరించుకునేదే లేదని నెతన్యాహూ స్పష్టం చేశారు. తాను ప్రధానిగా ఉన్నంతవరకు ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని ఆయన ప్రకటించడం గమనార్హం.






