19 June, 2026 | 2:42 AM

షబ్బీర్‌కు షాక్!

19-06-2026 01:30 AM

కామారెడ్డి కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్

  1. నాడు శిష్యుడు.. నేడు కొరకరాని కొయ్య చంద్రశేఖర్‌రెడ్డి 
  2. షబ్బీర్‌ అలీ నాలుగు దశాబ్దాల తిరుగులేని రాజకీయాలకు ఎదురుదెబ్బ 
  3. క్రమశిక్షణ సంఘానికి ఇరువర్గాల ఫిర్యాదులు 
  4. షోకాజ్ నోటీసులు.. ముదిరి పాకానపడ్డ అధిపత్య పోరు

కామారెడ్డి, జూన్ 18 (విజయక్రాంతి): కామారెడ్డి కాంగ్రెస్‌లో వర్గపోరు (కోల్డ్‌వార్) తారాస్థాయికి చేరింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు, సీనియర్ నేత మహమ్మద్ షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రధా న కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఈ వివాదం విమర్శలు, ప్రతి విమర్శలు దాటుకుని గాంధీభవన్‌కు  చేరింది. ఇరువర్గాలు పరస్పరం పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేసుకున్నాయి. 

నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా కొనసాగుతోన్న షబ్బీర్ అలీ.. తన సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలోనూ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్నారు.  తాను అనుకున్నదే శాసనం.! ఎవరికి ఏ పదవి కావాలన్నా, ఎవరికి ఏ ఆపద వచ్చినా షబ్బీర్ అలీ ముందుంటారు.

అయితే తన అనుచరులను, ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ఎదగనీయకుండా అడ్డుకు న్నారన్న అపవాదు కూడా ఆయనపై ఉంది. ఆయన తీరుపై పలువురు నేతల్లో అంతర్గతంగా అసంతృప్తి నెలకొన్నప్పటికీ పైకి చేప్పలేకపోతున్నారు. పార్టీ కోసం ఎంతోకాలంగా పని చేస్తున్నాం, కష్టకాలంలోనూ వెన్నుదన్నుగా నిలిచినా తమకు గర్తింపు దక్కడం లేదని, మండల స్థాయికే పరిమితం అయ్యామన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    

నాలుగేళ్ల క్రితమే..

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ నాలుగు సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కృతుడైన చంద్రశేఖర్‌రెడ్డి..  తాను కాంగ్రెస్‌లోకి వస్తానని షబ్బీ ర్ అలీ వద్దకు వెళ్లి ప్రాధేయపడ్డారు. అప్పటికే గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి భార్య గడ్డం ఇందుప్రియ బీఆర్‌ఎస్ నుంచి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామా లు, షబ్బీర్ అలీ సహకారంతో ఇందుప్రియ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నియామకం అయ్యారు. 

అప్పటి నుంచి షబ్బీర్‌అలీకి అనుచరుడుగా గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి కొనసాగారు. శాసనభ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా బరిలోకి దిగడంతో షబ్బీర్‌అలీకి నిజా మాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాం గ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఆ సమయంలో రేవంత్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయడానికి అతని సోదరుడు కొండల్‌రెడ్డి కామారెడ్డిలో మకాం వేశాడు. కొండల్‌రెడ్డికి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి ప్రచారంలో సహాయసహకారాలు అందించారు.

షబ్బీర్‌అలీ అనుచ రులు వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలున్నాయి. దీంతో గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి కొండల్ రెడ్డికి విశ్వాసపాత్రుడిగా కొనసాగి అతనికి దగ్గరయ్యాడు. అప్పటినుంచి కామారెడ్డి కాంగ్రెస్ లో వర్గ రాజకీయాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి స్వల్ప ఓట్ల తో ఓటమి పాలవడంతో షబ్బీర్‌అలీ, అతని అనుచరులపై కొండల్‌రెడ్డి గుర్రుగా ఉంటున్నారు. షబ్బీర్ అలీ సహకరించలేదని, గడ్డం చంద్రశేఖర్ అండగా నిలిచారన్న విషయం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లింది.

నాటి నుంచి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి  రేవంత్‌రెడ్డికి దగ్గరయ్యా రు. అంతేకాకుండా కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్ అలీ ఒంటెత్తు పోకడలు, ఆయ న ఆగడాలను సీఎం రేవంత్ దృష్టికి  చంద్రశేఖర్‌రెడ్డి తీసుకెళ్లారు. దీంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కి కామారెడ్డి లో తన సన్నిహిత వ్యక్తి ద్వారా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దగ్గరయ్యారు. పీసీసీ కమిటీలో షబ్బీర్‌అలీకి సమాచారం లేకుండానే చంద్రశేఖర్‌రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియా మకమయ్యారు. దీంతో షబ్బీర్‌అలీ షాక్‌కు గురయ్యారు.

అయితే గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం, అతని భార్యకు మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టడంతో పాటు ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమించడాన్ని..  కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్ నేతలు, షబ్బీర్‌అలీ అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై వారు పలుమార్లు షబ్బీర్ అలీని ప్రశ్నించారు. దాంట్లో భాగంగా గతంలో జరిగిన సంభాషణ వీడియోను ఇటీవల వైరల్ చేశారని తెలుస్తోంది.

కాగా కొంతకాలంగా చంద్రశేఖర్‌రెడ్డి ప్రత్యే క వర్గంగా ఏర్పడి  కామారెడ్డి నియోజకవర్గం లో షబ్బీర్‌అలీకి దీటుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిని షబ్బీర్ అలీ పోలీస్ కేసుల్లో ఇరికించారు. అతని వెంచర్‌లో అల్లుడు డిటోనేటర్లను నిలు వ ఉంచారన్న ఫిర్యాదుతో పోలీసులు దాడు లు నిర్వహించి చంద్రశేఖర్‌రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

ఇది షబ్బీర్ అలీ అనుచరు ల పనే అని  చంద్రశేఖర్‌రెడ్డి, అతని సతీమణి గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్‌రెడ్డి సోదరుడు గడ్డం సురేందర్‌రెడ్డి అప్పట్లో మీడియాతో మాట్లాడారు. వెంచర్‌తో, డిటోనేటర్లతో చంద్రశేఖర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని మీడి యా సమావేశంలో వెల్లడించడమే కాకుండా, పోలీసులకు కూడా సాక్ష్యాధారాలతో వివరించారు. అప్పటినుంచి షబ్బీర్‌అలీ, చంద్రశేఖ ర్‌రెడ్డి వర్గీయుల మధ్య వర్గపోరు పోరు మరింత పెరిగింది.     

మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్..

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో చంద్రశేఖర్‌రెడ్డి తన అనుచరులకు 13 వార్డుల్లో షబ్బీర్ అలీకి ప్రమేయం లేకుండా టికెట్‌లు ఇప్పించుకున్నారు. మరికొందరికి టికెట్‌లు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు.  షబ్బీర్‌అలీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాలుగు దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నానని, నాలుగుసార్లు మున్సిపాలిటీ పీఠాన్ని  దక్కించుకున్నాం, తాను కోరిన వారికి టికెట్‌లు ఇవ్వకుంటే ఎట్లా అని పార్టీ పెద్దలతో పేచీ పెట్టుకున్నారు. దీంతో షబ్బీర్ అలీ కోరిన వార్డులను కేటాయించిన తర్వాతే గడ్డం చంద్రశేఖర్‌రెడ్డికి 13 వార్డులను కేటాయించారు. వర్గాలుగా విడిపోయి పోటీ చేయడంతో కొందరు కౌన్సిలర్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.  

వైస్ చైర్‌పర్సన్ పదవి బీఆర్‌ఎస్‌కు..

కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా కైవసం చేసుకోవాల్సి ఉండగా.. షబ్బీర్ అలీ, గడ్డం చంద్ర శేఖర్‌రెడ్డి వర్గపోరుతో ఇబ్బందులు తప్పలేదు. తప్పనిసరిగా గెలువాల్సిన స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. చివరికి బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మద్దతుతో చైర్‌పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. ఒప్పందం ప్రకారం వైస్ చైర్‌పర్సన్ పీఠాన్ని బీఆర్‌ఎస్‌కు ఆప్పగించారు. తదనంతరం షబ్బీర్‌అలీ, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి వర్గాల మధ్య మరింత అంతరం పెరిగింది. తాజా పరిణామాల వల్ల ఎవరి వర్గంలో కొనసాగాలో నని? కాంగ్రెస్ క్యాడర్ అయోమంలో ఉంది.    

ఎస్పీకి ఫిర్యాదు..

పార్టీలో నెలకొన్న పరిణామాలు చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి. షబ్బీర్ వర్గీయు లు తన వాయిస్‌ను ట్రోలింగ్ చేస్తూ, తన ప్రతిష్టను మంట కలుపుతున్నారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాజేష్‌చంద్రకు ఇందుప్రియ ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పోలీసులు షబ్బీర్‌అలీ అనుచరులు 10 మందిపై కేసు నమోదు చేశారు. 

మరుసటి రోజు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, అతని అనుచరులపై కామారెడ్డి సీఐకి, డిఎస్పీకి, ఎస్పీకి షబ్బీర్ అలీ ఫిర్యాదు చేశారు. ఆడియో షబ్బీర్‌అలీది కాదని, ఆయన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొంత మంది చేసిన కుట్ర అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుట్రదారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   

రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశం..

కామారెడ్డి కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గపోరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇరువర్గాలు కలిసి పని చేయకపోతే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థు లు ఓటమిపాలయ్యే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు వాపోతున్నారు. ఇదిలా ఉండగా అధిష్ఠానానికి ఇరు వర్గాలు ఫిర్యాదులు చేయడమే కాకుండా, పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కి పార్టీ పరువును బజారు కీడ్చిన వారిపై పార్టీ అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.  

పరస్పరం ఫిర్యాదులు 

చంద్రశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని షబ్బీర్‌అలీ అనుచరులు, కామారెడ్డి నియోజకవర్గ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు  క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌కు నష్టం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి వర్గీయులు సైతం క్రమశిక్షణ సంఘానికి షబ్బీర్‌అలీపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలకు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు పంపింది.

దానికి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి సాక్ష్యాధారాలతో వివరణ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌పై, కాంగ్రె స్ పార్టీపై, మహిళల పట్ల కించపరిచే విధం గా షబ్బీర్ అలీ సంభాషణ ఉన్న ఆడియో రిలీజ్ కావడంతో.. దానిపై  చంద్రశేఖర్‌రెడ్డి సతీమణి, కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్స న్ గడ్డం ఇందుప్రియ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.

షబ్బీర్‌అలీ కూడా క్రమశిక్షణ సంఘానికి వివరణ ఇచ్చారు. ఆడియోలో తనది కాదని, ఎవరో కుట్రపూరితంగా తయారుచేసి విడుదల చేశారని పేర్కొన్నారు. మహేష్‌కుమార్‌గౌడ్‌తో తనకు  సన్నిహిత సంబంధాలున్నాయని,  తనకు తమ్ముడు లాంటివాడని వివరించారు. ఫేక్ ఆడియో సృష్టించిన వారిని గుర్తించి, శిక్షించాలని షబ్బీర్‌అలీ క్రమశిక్షణ సంఘాన్ని కోరారు.