5 March, 2026 | 4:03 AM

వైభవంగా రంగనాథుని రథోత్సవం

05-03-2026 02:24 AM

ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభం 

వేలాదిగా తరలి వచ్చిన భక్తులు

ఆలయ ధర్మకర్త రాజా కృష్ణదేవరావు, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి

శ్రీరంగాపురం మార్చి 4: శ్రీరంగాపురం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో నిర్వహించిన రంగని రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. తెల్లవారుజామునే వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

రథోత్సవాన్ని ఆలయ ధర్మకర్త రాజా కృష్ణదేవరావు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. వేదమంత్రాల నడుమ స్వామివారిని అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. రథం కదిలిన ప్రతి క్షణం గోవిందా& గోవిందా& నినాదాలతో మారుమోగింది.

భక్తులు భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగుతూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ వేడుకలో స్థానిక ఎమ్మెల్యే మెఘా రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాభివృద్ధి, ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేశారు. అలాగే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు భక్తులకు పులిహోర, మంచినీరు, అరటిపండ్లు వితరణ చేసి సేవాభావాన్ని ప్రదర్శించారు.

అదేవిధంగా స్థానిక వాలీబాల్ క్రీడాకారులు కూడా ముందుకు వచ్చి రథోత్సవానికి తరలివచ్చిన భక్తులకు మంచినీరు అందిస్తూ సహకరించారు. గ్రామ ప్రజల సమిష్టి కృషితో నిర్వహించిన ఈ రథోత్సవం ఆధ్యాత్మిక ఉత్సాహంతో, భక్తి పారవశ్యంతో వైభవంగా ముగిసింది. రథోత్సవంలో స్థానిక ఎస్‌ఐ హిమబిందు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, స్థానిక సర్పంచ్ మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.