1 August, 2026 | 2:40 AM

పొంగుతున్న గోదారి

01-08-2026 01:41 AM

కృష్ణానది ఉధృతి

  1. ప్రాజెక్టులకు భారీ వరదలు
  2. అప్రమత్తమైన అధికారులు

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి) : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి ఉప్పొంగుతున్నది. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉధృతమైంది. రెండు నదీ బేసిన్లలోని ప్రధాన జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుండగా, ప్రాజెక్టుల నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఆనకట్టల భద్రత దృష్ట్యా అధికారులు భారీ మొత్తంలో నీటిని దిగు వకు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చగా, కృష్ణా బేసిన్‌లో జూరాల మీదుగా శ్రీశైలం వైపు వరద ఉధృతంగా కొనసాగుతోంది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ హెచ్చరించింది. గోదావరి బేసిన్‌లో వరద ప్రవాహం రోజు రోజుకు పెరుగుతోంది.

భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం ౧౨.౫౬ లక్షల క్యూసెక్కులకు చేరగా, నీటిమట్టం 51.౨ అడుగులు నమోదైంది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1,13,341 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,08,193 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 65,422 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది.

మిడ్ మానేరు, కడెం, నిజాంసాగర్, సింగూర్ జలాశయాలకు కూడా గణనీయమైన ప్రవాహాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల వద్ద కూడా భారీ వరద కొనసాగుతోంది.

లక్ష్మీబ్యారేజ్ (మేడిగడ్డ) వద్ద 8,35,800 క్యూసెక్కులు, సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) వద్ద 1,26,300 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ (దుమ్ముగూడెం) వద్ద 9,13,643 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది.

వచ్చిన నీటిని దాదాపు పూర్తిగా దిగువకు విడుదల చేస్తూ అధికారులు వరద నిర్వహణ చేపడుతున్నారు. కృష్ణా నదీ బేసిన్‌లో కూడా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో జూరాల మీదుగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతోంది.

శ్రీశైలం జలాశయానికి 1,05,709 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవగా, ప్రస్తుతం నీటిమట్టం 831.60 అడుగులు, నిల్వ 51.18 టీఎంసీలు ఉంది. దిగువకు ప్రస్తుతం 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు 1,16,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,05,198 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలలో ప్రస్తుతం 8.13 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఆల్మట్టి జలాశయానికి 83 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

నారాయణపూర్ జలాశయానికి కూడా 1.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,05,474 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ఈ నీరంతా జూరాల మీదుగా శ్రీశైలం వైపు చేరుతోంది. నాగార్జునసాగర్ జలాశయంలో ప్రస్తుతం 136.99 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, పులిచింతలలో 29.08 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం ఈ రెండు జలాశయాల వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో తక్కువగానే ఉన్నప్పటికీ, ఎగువ నుంచి వరద పెరిగితే పరిస్థితి మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఇంకా కొనసాగుతున్నందున రానున్న రోజుల్లో గోదావరి, కృష్ణా బేసిన్లలో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది. అందుకే ఆనకట్టల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరానికి అనుగుణంగా నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాలు, లోతట్టు గ్రామాల ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.