1 August, 2026 | 1:55 AM

‘రేషన్’ ఈకేవైసీ గడువు పెంపు

01-08-2026 12:59 AM
  1. ఆగస్ట్ 31వరకు పొడిగింపు
  2. రేషన్ పంపిణీకి ఈకేవైసీ అడ్డంకి కాదన్న అధికారులు

హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): రేషన్ కార్డుల ఈ-కేవైసీ నమోదు గడువు ముగియడంతో, ఆ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూపర్ ఎల్ నినో ప్రభావం కారణం కేంద్ర ప్రభుత్వం రేషన్ ఉన్నవారికి మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలతో పాటు బియ్యాన్ని పంపిణీ చేసింది. ఈ క్రమంలో రేషన్ కార్డు ఈ కేవైసీ గడువు శుక్రవారంతో ముగిసింది.

ఇప్పటి వరకు వివిధ కారణాలతో ఈకేవైసీ పూర్తి చేసుకొని వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊరట కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. తొలుత జీహెచ్‌ఎంసీ పరిధిలోని లబ్ధిదారులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించినప్పటికీ, ఇతర జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ వ్యాప్తంగా వర్తింపజేసింది. రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ కొనసాగుతుండటం, పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ గడువును పెంచినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ-కేవైసీ ప్రక్రియతో సంబంధం లేకుండానే శనివారం నుంచి ఒక్కో కార్డుదారునికి మూడు నెలల రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేయనున్నారు. గడువు పొడిగింపు వల్ల ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేసుకోని లబ్ధిదారులు ఆగస్టు 31 వరకు సమీప రేషన్ డీలర్ వద్ద ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని, రేషన్ పంపిణీకి ఈ-కేవైసీ అడ్డంకి కాదని అధికారులు స్పష్టం చేశారు.