మరిన్ని నిధులివ్వండి
* తెలంగాణలో గ్రామీణ రోడ్లు, పేదలకు భారీ సంఖ్యలో ఇండ్లను మంజూరు చేయాలి
* ఢిల్లీలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గోడెం నగేష్ భేటీ
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో మరిన్ని నిధులు కేటాయించాలని బీజేపీ ఎంపీలు కోరారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, గోడెం నగేశ్ భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా వారు వివిధ పథకాల కింద తెలంగాణకు భారీగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు.
తెలంగాణలో నేటికీ అనేక మారుమూల పల్లెలకు సరైన రోడ్డు రవాణా సదుపాయాలు లేవని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గిరిజన తండాలకు, ఆదివాసీ ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరచాలని, మండల కేంద్రాల నుంచి గ్రామ పంచాయతీల్లో రోడ్ల విస్తరణ చేపట్టాలని కోరారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అనేక గ్రామ పంచాయతీలలో రోడ్ల అభివృద్ధి పనులు జరిగాయని, భవిష్యత్‌లో కూడా రాష్ట్రానికి గ్రామీణ రహదారులను మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతిం టి కల సాకారం చేసేందుకు భారీ సంఖ్యలో ఇండ్లను మంజూరుచేయాలని, మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని విన్నవించారు. ఈ విజ్ఞప్తులకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించినట్టు ఎంపీలు పేర్కొన్నారు.






