దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి
రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట దళిత హక్కుల పోరాట సమితి ధర్నా
శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (విజయక్రాంతి): దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి రంగారెడ్డి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి కే. వెంకటస్వామి అధ్యక్షత వహించారు.జిల్లా డిహెచ్పిఎస్ ఇన్చార్జి టి. రామకృష్ణ మాట్లాడుతూ దళిత సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షల రూపాయల సంక్షేమ నిధులు వెంటనే విడుదల చేయాలని, దశాబ్దాలుగా సాగుచేస్తున్న అసైన్డ్ భూములపై ఉన్న పరిమితులు తొలగించి సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించాలని, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దళిత కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు.ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టకుండా విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల కోసం పూర్తి స్థాయిలో కేటాయించాలని, నిరుపేద దళితులకు ఇండ్ల స్థలాలు కేటాయించి వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని, డప్పు కళాకారులకు అధికారిక గుర్తింపు కార్డులు అందించి నెలకు పది వేల రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని కూడా డిమాండ్ చేశారు.
స్వయం ఉపాధి, చిన్న పరిశ్రమల కోసం దరఖాస్తు చేసిన ఎస్సీ లబ్ధిదారుల పెండింగ్ ఇండస్ట్రియల్ రుణ సబ్సిడీలు వెంటనే విడుదల చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువకులకు రుణాలు మంజూరు చేయాలని కూడా నాయకులు పట్టుబట్టారు.ప్రభుత్వం ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం ముగింపులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.ఈ ధర్నాలో శేరిలింగంపల్లి సిపిఐ కార్యదర్శి కె. చందు యాదవ్, జెట్టి శ్రీనివాస్, డిహెచ్పిఎస్ మండల కార్యదర్శి ఎస్. కొండలయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు కూన సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.






