6 July, 2026 | 4:30 AM

అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్‌ఐఆర్ లక్ష్యం

06-07-2026 12:52 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూలై 5 (విజయక్రాంతి): ఓటర్ల ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం అత్యంత పారదర్శకంగా, చురుకుగా జరుగుతున్నట్లు భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ రాహుల్ శర్మ  తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్త ఓటర్లను చేర్చడం, మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించడం, ఓటర్ల వ్యక్తిగత వివరాల్లో అవసరమైన సవరణలు మార్పులు, చేర్పులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు.

ఫారాల పంపిణీ, స్వీకరణ

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 98 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. పంపిణీ చేసిన ఎన్యూమ రేషన్ ఫారాలను పూర్తి చేసి, తిరిగి స్వీకరించే ప్రక్రియ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోందని తెలిపారు.

డిజిటలైజేషన్ ప్రక్రియ

సేకరించిన ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ సమాంతరంగా పకడ్బందీగా సాగుతోందని, ఇప్పటివరకు 9 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు తెలిపారు. దీనివల్ల ఓటర్ల జాబితా మరింత ఖచ్చితత్వంతో రూపొందుతుందని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 317 మంది బూత్ లెవల్ అధికారులు ఈ ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.  ఓటర్లకు ప్రజలు ఏదేని సలహాలు, సూచనలకు బూతు స్థాయి సిబ్బందిని కానీ మునిసిపల్, తహసీల్దార్ కార్యాలయాలను సంప్రదించొచ్చని తెలిపారు.

ఎన్యుమరేషన్ ఫారాలు నింపడంలో తగిన సహాయం అందిస్తారని తెలిపారు. ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఇది పూర్తిగా నిబంధనలకు లోబడి, అత్యంత పారదర్శకంగా జరుగుతున్న ప్రక్రియ అని, అర్హులైన వారందరూ తమ వివరాలను సకాలంలో అందించి, ఓటు హక్కు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఓటరు నమోదు, సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చురుకుగా భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.