28 August, 2026 | 5:26 AM

సింగరేణి సమస్యల పరిష్కారమే లక్ష్యం

28-08-2026 12:00 AM

రామగుండంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి

ఆపరేషన్స్ డైరెక్టర్‌తో కీలక సమీక్షలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

గోదావరిఖని, ఆగస్టు 27 (విజయకాంతి): రామగుండం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, సింగరేణి ప్రాంత సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా స్థానిక శాసనసభ్యులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవ చూపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సింగరేణి సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యనారాయణతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సింగరేణి సంస్థ కార్యకలాపాల పురోగతి, కార్మికుల సంక్షేమం, గనుల భద్రతా చర్యలు మరియు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అభి వృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు. సింగరేణి పరిధిలోని ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు వంటి కనీస మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ అధికారులు, సింగరేణి యాజమాన్యం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రామగుండం అభివృద్ధికి సింగరేణి సంస్థ తన పూర్తి సహకారాన్ని అందించాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, ఆర్జీ-1, ఆర్జీ-2 జనరల్ మేనేజర్లు, ఏసీపీ రమేష్, ఎంఆర్‌ఓతో పాటు పలువురు కార్పొరేటర్లు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.