ప్రసంగాలకే.. బీజేపీ నేతలు!
- ‘జెన్- జడ్’కు చేరువయ్యేలా కార్యక్రమాల ఏర్పాటు
- క్షేత్రస్థాయిలో లక్ష్యానికి భిన్నంగా సుదీర్ఘ ఉపన్యాసాలు
- వ్యూహాలకు విరుద్ధంగా ఇష్టారీతిన సమావేశాలు
- యువత విమర్శలు, సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు
- ‘జెన్- జడ్’ చెప్పేది వినడాన్ని విస్మరిస్తున్న బీజేపీ నాయకులు
హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): భారతదేశంలో(India) అత్యంత కీలకంగా మారుతున్న యువ ఓటర్లను(young voter) తమవైపు నకు తిప్పుకునేందు కు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)(బీజేపీ) చేపట్టిన ప్రయత్నం ఆశించిన దిశలో సాగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలోని యువత తో నేరుగా మమేకమై, వారి సమస్యలు, ఆకాంక్షలు, అసంతృప్తులను తెలుసుకుని, వాటిపై సమగ్ర నివేదికలు రూపొందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఇటీవల సూచించినట్లు పార్టీ వర్గాల నుంచి అందిన సమా చారం.
కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, హాస్టళ్లకు వెళ్లి యువతతో సమయం గడపాలని, వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలుసుకోవడం, ఆ సమాచారాన్ని ప్రభుత్వ విధానాలు, పార్టీ ప్రచార వ్యూహాల్లో ఉపయోగించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఒకవైపు కాంగ్రెస్ చేపడు తున్న విద్యార్థి కార్యక్రమాలకు ధీటుగా నిలవడం, మరోవైపు 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జెన్-జెడ్ తరానికి బీజేపీతో ఉన్న రాజకీ య, భావోద్వేగ దూరాన్ని తగ్గించడమే అసలు వ్యూహ లక్ష్యంగా కనిపిస్తోంది.
కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు మాత్రం లక్ష్యానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు, సీనియర్ బీజేపీ నేతలు యువతను సమావేశాలకు పిలిచి, ప్రభుత్వ విజయాలను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగాలు చేసి, చివర్లో ఫొటోలకు ఫొజులిచ్చి వెళ్లిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా యువ తతో నిజమైన సంభాషణ జరగాల్సిన చోట, ఒక అధికారిక కార్యక్రమంలా లేదా ‘హోంవర్క్’ పూర్తి చేసినట్టుగా ఆ సమావేశాల తీరు మారిందనే వ్యంగ్యాస్త్రాలు వినిపిస్తున్నాయి.
విద్యార్థి కేంద్రంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘ఛాత్రోం సే గూంజ్’ కార్యక్రమం ఇప్పటికే విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలో తన పరిధిని విస్తరి స్తోంది. విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణలు, వారి సమస్యలను వినే కార్యక్రమాలు, యువతను లక్ష్యంగా చేసుకున్న డిజిటల్ కంటెంట్‌తో ఆ పార్టీ ముందుకు సాగుతోంది. బీజేపీ వ్యూహకర్తలు మాత్రం.. ఈ కార్యక్రమాన్ని దీర్ఘకాలిక రాజకీయ సవాలుగా పరిగణిస్తున్నారు. భార త జనాభాలో జెన్-జెడ్ వాటా దాదాపు 27 శాతంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
కొన్ని రాష్ట్రాల్లో తొలిసారి ఓటు హక్కు పొందుతున్న వారిలో యువత వాటా మరింత ఎక్కువగా ఉంది. ఉద్యోగాల కొరత, ద్రవ్యోల్బణం, పరీక్షల నిర్వహణలో జాప్యం, ప్రభుత్వ ప్రకటనల కు -క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య కనిపిస్తున్న అంతరం వంటి అంశాలపై యువతలో అసంతృప్తి పెరుగుతోందని పార్టీ అంతర్గత అంచనా లు సూచిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో యువత మాటలు వినాలనే ‘సంస్కృతి’తో ముందుకు సాగాలని మోదీ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేతలు వేదికలపై కూర్చోకుండా విద్యార్థుల మధ్య కూర్చోవాలని, కాలేజీలు, హాస్టళ్లలో వారితో సరదాగా సమయం గడపా లని, ప్రచారం కంటే అభిప్రాయ సేకరణకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఉద్దేశం ఒకటైతే.. అమలు మరోలా..
అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనపడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన సమావేశాలు ఒకే విధంగా మూసపద్ధతిలో కొనసాగుతున్నాయి. స్వాగత కార్యక్రమం, ప్రభుత్వ పథకాలు,- అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘ ప్రసంగం, పరిమితంగా ప్రశ్నోత్తరాలు, చివర్‌లో ఫొటో సెషన్.. ఇదే తీరుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఉత్తరాదిలోని ఒక రాష్ట్రంలో ఓ కేంద్రమంత్రి నిర్వహించిన సంభా షణ 90 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే ముగిసింది.
అందులో సగానికి పైగా సమయం మంత్రి ప్రసంగించడానికే తీసుకు న్నారు. పశ్చిమ భారతదేశంలో మరో నేత.. క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థి ప్రతినిధులను కలవడానికి బదులుగా ఓ హోటల్‌లో సమావేశానికి ఆహ్వానిం చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో విద్యార్థులు వరుసల్లో కూర్చుని ఉండగా, నేతలు ముందు నిలబడి ప్రసంగి స్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. యువతతో సంభాషణ కంటే తరగతి గదిలో ఉపన్యాసాన్ని తలపించే ఈ దృశ్యాలే ఇప్పుడు విమర్శలకు కారణమవుతున్నాయి.
జెన్ -జడ్ నుంచి, సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు
బీజేపీ నేతల తీరుపై జెన్ -జడ్ నుంచి, సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. ‘హాజరు తీసుకున్నా రు.. ప్రధాని కార్యాల యానికి హోంవర్క్ సమర్పించాం’ అంటూ ఓ పోస్టు వైరల్ కాగా, మరో మీమ్‌లో ‘మేము మాట్లాడ టానికి వచ్చాం.. ప్రసంగం వినడానికి కాదు’ అనే ప్లకార్డులను విద్యార్థులు పట్టుకున్నట్లుగా చూపించారు.
ఒక కేంద్ర విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ చదువుతున్న మూడో సంవత్సరం విద్యార్థి మాట్లాడుతూ, తమ సమస్యలను చెప్పుకునే అవకాశం లభిస్తుందని భావించామని, కానీ ప్లేస్‌మెంట్లు, పరిశోధనకు నిధులు, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై మాట్లాడే బదులు.. దేశం అభివృద్ధి చెందుతోంది’ అనే అంశంపై 40 నిమిషాల ప్రసంగం వినాల్సి వచ్చిందని అన్నాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ పీజీ విద్యార్థి మరింత ఘాటుగా స్పందించాడు.
యువత మధ్య కూర్చుని వారి సమస్యలను వినే ప్రయత్నం కాంగ్రెస్ కార్యక్రమాల్లో కనిపిస్తోందని, మరోవైపు బీజేపీ మంత్రులు భద్రతా సిబ్బందితో వచ్చి ప్రసం గించి వెళ్లిపోతున్నారని పేర్కొన్నాడు. ఈ సమావేశాలను ‘తల్లిదండ్రులు, -ఉపాధ్యాయుల సమావేశం.. కానీ మాట్లాడేది టీచర్ ఒక్కరే’ అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు పోల్చుతున్న రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మరికొన్ని పోస్టులు ‘ఎన్‌పీసీ ఎనర్జీ’ అంటూ జెన్ జడ్ పరిభాషను జోడిస్తున్నాయి.
యువత సమస్యలే అసలు పరీక్ష..
యువతలో నిరుద్యోగం, ముఖ్యంగా ఉన్నత విద్యావంతుల్లో ఉద్యోగాల కొరత ఇప్పటికీ కీలక సమస్యగానే ఉంది. ఇండియన్ ఎంప్లాయి మెంట్ రిపోర్టు 2024లో కూడా విద్యావంతులైన యువతలో నిరుద్యోగత అసమానంగా అధికంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. ఇటీవలి సంవత్సరాల్లో నిర్వహించిన పలు రాజకీయ సర్వేలు కూడా వృద్ధ ఓటర్లలో బీజేపీకి ఉన్న మద్దతుతో పోలిస్తే, తొలిసారి ఓటు వేయబోయే యువత, యువ ఓటర్లలో ఆ పార్టీ ఆధిక్యం కొన్ని రాష్ట్రాల్లో తగ్గినట్లు సూచించాయి.
డిజిటల్ యుగంలో పెరిగిన యువత రాజకీయ సమాచారాన్ని ప్రధానంగా షార్ట్‌ఫార్మ్ వీడియోలు, సోషల్ మీడియా, స్నేహితుల మధ్య చర్చలు, వ్యక్తిగత అనుభవాల ద్వారా తెలుసుకుంటు న్నారు. అలాంటి తరంతో గంటల తరబడి ప్రసంగాలతో అనుబంధాన్ని ఏర్పర్చుకోవడం అంత సులభం కాదు. బీజేపీకి చెందిన కొందరు నేతలు కూడా ఈ సమస్యను అంగీకరిస్తున్నారు. ప్రధానమంత్రి ‘నిజమైన అభిప్రాయాలు’ కావాలని కోరారు.
కానీ పైస్థాయికి వెళ్తున్న నివేదికల్లో విజయవంతమైన సమావేశాల వివరాలు, ఫొటోలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఓ నేత వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మరో నేత మాట్లాడుతూ, యువతతో గంటల తరబడి హాస్టల్ మెస్‌లో కూర్చుని మాట్లాడటానికి ప్రసంగం లేకుండా ఉండటం కొందరికి అసౌకర్యంగా ఉందని అంగీకరించారు.
అయితే ప్రతి చోటా పరిస్థితి ఇలాగే లేదు. కొన్ని ప్రాంతాల్లో యువ బీజేపీ ఎంపీలు, రాష్ట్రస్థాయి నేతలు సాధారణం గానే విద్యార్థులతో సమావేశమవుతున్నారు. అయితే కెమెరాలకు అనుకూలంగా నిర్వహిస్తున్న సీనియర్ నేతల కార్యక్రమాలే ఎక్కువగా కనిపిస్తుండటంతో, ఇలాంటి మంచి ప్రయత్నాలు కూడా మరుగున పడుతున్నాయి.
వినడమే కాదు.. స్పందించాలి
బీజేపీ నేతలు, యువత మధ్య ఎదురవుతున్న ఈ పరిణామం బీజేపీకి సవాల్‌గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. జెన్ జడ్‌తో అనుబంధం ఏర్పరచుకోవడమనేది ఒకట్రెండు సమావేశాలతో సాధ్యమయ్యే పని కాదు. యువత ఇప్పటికే ఉన్న డిజిటల్ వేదికల్లో నిరంతరంగా కనిపించాలి. విమర్శలను సానుకూలంగా స్వీకరించాలి. వారు లేవనెత్తే సమస్యలపై స్పష్టమైన చర్యలు తీసుకోవడం అవసర మని వారంటున్నారు.
ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, పరీక్షల నిర్వహణ, పరిశోధన అవకాశాలు, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై యువత చెప్పే మాటలు.. ప్రభుత్వ పరంగా తీసుకునే విధానపరమై నిర్ణయాలలో ప్రతిబింబించాలి. కాంగ్రెస్ ‘చాత్రోం సే గూంజ్’ కార్యక్ర మం ద్వారా ‘వినడం’ అనే అంశాన్ని రాజకీయ సందేశంగా ముందుకు తెస్తున్న సమయంలో, బీజేపీ కూడా తన అసలు ఉద్దేశా న్ని ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉంది. అలా చేసినప్పుడే జెన్- జెడ్ సమస్యలకు పరిష్కారాలు చూపడంతో పాటు, యువతకు బీజేపీకి మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
ఇప్పటివరకు అందుతున్న సంకేతం మాత్రం స్పష్టంగానే ఉంది. యువతకు ఒక ప్రసంగాన్ని వినిపించడం సులభమే. కానీ వారు చెప్పేది పూర్తిగా వినడం మాత్రం అంత సులభం కాదు. సోషల్ మీడియా యుగంలో ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను జెన్- జడ్ ఇట్టే గుర్తిస్తోంది. బీజేపీ ముందున్న అసలు పరీక్ష కూడా ఇదే. యువతతో మాట్లాడటం కాదు, యువత మాట వినడం.. వినడం మాత్రమే కాదు, దానికి స్పందిస్తేనే పార్టీకి, జెన్ జడ్‌కు మధ్య ఒక వారధిని నిర్మించవచ్చు.
అసలు ఆదేశం ఏమిటంటే..
పార్టీ అంతర్గతంగా అందిన సమాచారాన్ని బట్టి.. విద్యార్థులతో కలిసి కూర్చోవడం, క్యాంపస్‌లు, హాస్టళ్లను సందర్శించడం, వారి సమస్య లు, ఆకాంక్షలు, అసంతృప్తులను తెలుసుకోవడం, నిజమైన అభిప్రాయాలను సేకరించి వాటి ఆధారంగా విధానాలు, ప్రచార వ్యూహాలను రూపొందించేందుకు నివేదికలు సమర్పించడం ప్రధాన ఉద్దేశం. కాంగ్రెస్ చేపడుతున్న విద్యార్థి కార్యక్రమాలకు ధీటుగా నిలవడంతో పాటు, 1997 మధ్య జన్మించిన జెన్ జడ్ తరంతో బీజేపీకి ఉన్న భావోద్వేగ, రాజకీయ అనుబంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం.
సంభాషణ పేరుతో ప్రసంగాలే..
ఉత్తరాది రాష్ట్రంలో ఓ కేంద్ర మంత్రి నిర్వహించిన సంభాషణ 90 నిమిషాల కంటే తక్కువసేపు సాగగా, అందులో సగానికి పైగా సమయం ఆయన ప్రసంగించడానికే అయిపోయింది. పశ్చిమ భారత్‌లోని మరో నేత క్యాంపస్‌కు వెళ్లి విద్యార్థి ప్రతినిధులతో మాట్లాడకుండా.. ఒక హోటల్‌లో సమావేశానికి పిలిచారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో విద్యార్థులు వరుసల్లో కూర్చుని ఉండగా, నేతలు వారి ముందు నిలబడి ప్రసంగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులతో సంభాషణ కంటే తరగతి గదిలో ఉపన్యాసంలా ఈ కార్యక్రమాలు మారిపోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






