28 August, 2026 | 4:30 AM

‘తుమ్మిడిహట్టి’పై కీలక భేటీ

28-08-2026 02:45 AM
  1. సెప్టెంబర్ 1న ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం
  2. సీఎం రేవంత్ వీఐపీ రిఫరెన్స్‌తో ఏర్పాటు
  3. బరాజ్ సాంకేతికత, అంతర్రాష్ట్ర అంశాలపై చర్చ
  4. తెలంగాణ, మహారాష్ట్ర అధికారులకు ఆహ్వానం

హైదరాబాద్, ఆగస్టు27 (విజయక్రాంతి): తుమ్మిడిహట్టి బరాజ్(Tummidihatti barrage) అంశం మరోసారి కేంద్ర జలసంఘం(Central Water Commission) (సీడబ్ల్యూసీ) పరిశీలనకు వచ్చింది. ప్రాణహిత నది(Pranhita River)పై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలతో పాటు మహారాష్ట్రతో ముడిపడిన అంతర్రాష్ట్ర వ్యవహారాలపై చర్చించేందుకు సెప్టెంబర్ 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది.  సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన ఉన్నతాధికా రులు హాజరుకానున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వీఐపీ రిఫరెన్స్‌లోని అంశాల ఆధారంగానే ఈ సమావేశం ఏర్పా టు చేసినట్లు సీడబ్ల్యూసీ ప్రాజెక్ట్ అప్రైజల్ (సౌత్) డైరెక్టరేట్ జారీ చేసిన నోటీసులో పేర్కొంది. ఈ సమావేశానికి హాజరుకావాలని తెలంగాణ ఇరిగేషన్, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ శాఖ కార్యదర్శి, మహారాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి సీడబ్ల్యూసీ సమాచారం పంపింది.

సంబంధిత సమాచారం, సాంకేతిక వివరాలు, అవసరమైన ఇన్‌పుట్‌తో హాజరు కావాలని సూచిం చింది. అదే విధంగా సీడబ్ల్యూసీకి చెందిన ప్రాజెక్ట్ అప్రైజల్ ఆర్గనైజేషన్, వాటర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్, హైడ్రాలజికల్ స్టడీస్, ఇరిగేషన్ మేనేజ్‌మెంట్ విభాగాల ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు. 

ఈ అంశాలపైనే కీలక చర్చ!

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం, నీటి లభ్యత, అంతర్రాష్ట్ర సమస్యలు, సాంకేతిక అనుమతులకు సంబంధించి అంశాలు సీడబ్ల్యూసీ భేటీలో కీలకంగా మారాయి. ముఖ్యంగా మహారాష్ట్రతో ముడిపడి ఉన్న అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారుల అభిప్రాయాలను సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తుమ్మిడిహట్టి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వీఐపీ రిఫరెన్స్ ఆధారంగా సీడబ్ల్యూసీ స్థాయిలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సమావేశంలో సాంకేతిక అంశాలపై స్పష్టత రావడం తో పాటు, అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారానికి అవసరమైన తదుపరి చర్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి తదుపరి ప్రక్రియపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా బరాజ్ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిశీలనలు, నీటి లభ్యతకు సంబంధించిన అంశాలు, మహారాష్ట్రతో సమన్వయం వంటి కీలక విషయాలపై సీడబ్ల్యూసీ వైఖరి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

సీడబ్ల్యూసీ ప్రాజెక్ట్ అప్రైజల్ (సౌత్) డైరెక్టర్ నీరజ్‌కుమార్‌శర్మ జారీ చేసిన నోటీసుతో తుమ్మిడిహట్టి బరాజ్ అంశం మరోసారి అధికారికంగా కేంద్ర జల సంఘం పరిశీలనలోకి వచ్చినట్టయింది. 1 భేటీలో తెలంగాణ, మహారాష్ట్ర అధికారులు సమర్పించే వివరాలు, సీడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో జరిగే చర్చలు ప్రాజెక్టు తదుపరి అడుగులపై ప్రభావం చూపొచ్చు.

సీఎం రేవంత్ లేఖపై స్పందన

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేసి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించాలని లేఖలో కోరారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లగా, ప్రధానమంత్రి కార్యాలయం జలశక్తి మంత్రిత్వ శాఖకు పంపించింది. అనంతరం ఈనెల 5న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం ప్రత్యేకంగా లేఖ రాసి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

మహారాష్ట్ర గతంలో అంగీకరించిన 148 మీటర్ల ఎత్తుకు బదులుగా 152 మీటర్ల ఎత్తు ఉండేలా అంగీకారం సాధించేందుకు తెలంగాణ ప్రయత్ని స్తోంది. 148 మీటర్ల వద్ద అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తీసుకోవడం సాధ్యం కాదని, భారీ పంపులు వినియోగిస్తే విద్యుత్ వ్యయం పెరుగుతుందని కేంద్రానికి తెలంగాణ వివరించింది.

తక్కువ విద్యుత్ వ్యయంతో, దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టును నిర్మించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన వాదన. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ అధ్యయనాల ప్రకారం జలమట్టం పెంపుతో అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని కూడా ప్రభుత్వం కేంద్రందృష్టికి తీసుకె ళ్లింది. వెనుకబడిన, కరువు ప్రాంతాలకు సాగునీరు అందించే ఈ కీలక ప్రాజెక్టును త్వరగా కార్యరూపంలోకి తీసుకొచ్చే లక్ష్యం తో వరుస సంప్రదింపులు నడుస్తున్నాయి.