28 August, 2026 | 4:06 AM

ఆంధ్రా పెత్తనం

28-08-2026 02:12 AM
  1. బ్రాహ్మణ పరిషత్‌కు చైర్మన్, వైస్ చైర్మన్‌గా ఆంధ్రోళ్లు ఎందుకు? 
  2. ప్రస్తుత చైర్మన్ బసవరాజు శ్రీనివాస రాజు పచ్చి తెలంగాణ వ్యతిరేకి 
  3. గుట్ట బోర్డు మెంబర్లలో ఆంధ్రా హీరో భార్యకు పదవి 
  4. అన్ని డిపార్ట్‌మెంట్లలో ఆంధ్రోళ్లదే హవా 
  5. టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పాలనలో రాష్ట్రంలో ఆంధ్రావారి ఆధిపత్యమే నడుస్తున్నదని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్)TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఆరోపిం చారు. బ్రాహ్మణ పరిషత్‌(Brahmin Parishad)కు చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఆంధ్రావాళ్లను నియమించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రాహ్మణ పరిషత్ చైర్మన్‌గా ఉన్న బసవరాజు శ్రీనివాస రాజు అనే వ్యక్తి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమ(Telangana Movement) సమయంలో రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ బ్రహ్మణులలో అర్హులు లేరా అని నిలదీశారు. తెలంగాణవాదులను, దళితులను ఇష్టానుసారంగా తిట్టిన వ్యక్తికి బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చి దాన్ని రౌడీలకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. అటు యాదగిరిగుట్ట బోర్డు మెంబర్లలో ఆంధ్రా హీరో భార్యకు పదవి కట్టబెట్టారని ఆమె విమర్శించారు.

తెలంగాణ వాళ్ల పైసలతో కట్టిన గుడిలో ఆంధ్రావాళ్లకు పెత్తనం ఎలా ఇస్తారని నిలదీశారు. గురువారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత మాట్లాడా రు. రెడ్ కో చైర్మన్‌గా, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా అటు ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్‌లలో కూడా ఆంధ్రా పెత్తనమే ఉన్నదని కవిత ఆరోపించారు. బయోకాన్‌లో తెలుగు మాట్లాడినందుకు 200 మందిని తీసేస్తే ఈ సీఎం మాట్లాడడని మండిపడ్డారు. తెలంగాణ జలాలను ఆంధ్రా నాయకులు దోచుకుంటే కూడా రేవంత్‌రెడ్డికి సోయి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇప్పటికి కూడా కాంట్రాక్టులన్నీ ఆంధ్రా వాళ్లకే ఇస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆంధ్రా ఏజెంట్‌గా మారారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇందుకోసమే తెచ్చుకున్నామా అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల సీఎం అమెరికా టూర్‌కు కేంద్రం పర్మిషన్ ఇవ్వకపోతే ఆయనకు తెలంగాణ గుర్తుకు వచ్చిందన్నారు. కానీ తెలంగాణకు ఇన్ని నష్టాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

నిజంగా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బ్రహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా తెలంగాణ వారిని నియమించాలని డిమాండ్‌చేశారు. ఇటీవల జనసేనకు చెందిన ఓ ఎంపీ కుమారుడు రూ.6 కోట్ల విలువైన కారు వేసుకొని ఒడిశాకు చెందిన 25 ఏళ్ల అమ్మాయిని గుద్ది చంపితే సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదని గుర్తుచేశారు. ఆతనిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తండ్రి పేరు లేదని, అందులో ఎన్నో కాలమ్‌లు ఖాళీగా పెట్టారని మండిపడ్డారు.

వేరే కేసులలో కూడా ఇదే విధంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని, డీజీపీని ప్రశ్నించారు. ఇలాంటి డొల్ల ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసినందుకు పోలీసులు సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ప్రగతి భవన్ బారికేడ్లను గుద్దితేనే అతని జీవితాన్ని ఆగం చేశారని గుర్తుచేశారు. తెలంగాణకు చెందిన మైనార్టీ నాయకుని కుమారుడైనందుకే అలా చేశారని దుయ్యబట్టారు.

రేవంత్‌రెడ్డి ఆంధ్రావాళ్ల చేతిలో బందీ అయ్యారని, ఆయన అనుముల రేవంత్‌రెడ్డి కాదని, ఆంధ్రా రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఆంధ్రా ఏజెంట్‌గా రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అరాచకాలను ప్రశ్నించాల్సిన బీఆర్‌ఎస్ పూర్తిగా కాంప్రమైజ్ అయ్యిందని దుయ్యబట్టారు. ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని చెప్పారు. పారదర్శకమైన, అవినీతి లేని, కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు తాము వచ్చామని పేర్కొన్నారు.