28 August, 2026 | 4:16 AM

ప్రజల క్షేమాన్ని పూర్తిగా మరిచిన రేవంత్ ప్రభుత్వం

28-08-2026 12:00 AM

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కొత్తపల్లి, ఆగస్టు 27 (విజయక్రాంతి): రేవంత్ ప్రభుత్వం అలవిగాని అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి, ప్రజల క్షేమాన్ని పూర్తిగా మరిచిపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గం గుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలో ఎస్జీఎఫ్ నిధులు 10 లక్షలతో గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. తన వంతు సహాయంగా ఒక లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రం పదేళ్లపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోయిందని, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లారని గుర్తుచేశారు.

కేసీఆర్ హయాంలో ఇస్తున్న సంక్షేమ పథకాలతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇస్తామని ఆశ చూపి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజలను మోసం చేసిన ఏ ప్రభుత్వమైనా గద్దె దిగక తప్పదన్నారు. రానున్న రెండేళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రా వడం ఖాయమని, కేసీఆర్ నేతృత్వంలో ప్రజలకు మళ్లీ సుపరిపాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, నగునూరు సర్పంచ్ సాయిల్ల శ్రావణి మహేందర్, ఉప సర్పంచ్ హనుమంత రావు, నాయకులు పాషా, రవితేజ, దిలీప్, భద్రయ్య, శ్రీనివాస్, సుదర్శన్రెడ్డి, రంగారెడ్డి, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.