28 August, 2026 | 4:12 AM

జయరాజ్ ‘మైనింగ్’ రూ.100 కోట్లు!

28-08-2026 02:21 AM

భూపాలపల్లి మైనింగ్ ఏడీకి ఆదాయానికి మించిన ఆస్తులు 

  1.   12 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు 
  2. భారీగా ఆస్తులు, నగదు గుర్తింపు
  3. బోడుప్పల్‌లో రెండతస్తుల భవనం, కేపీహెచ్‌బీలో ఫ్లాట్ 
  4. కీసర, సూర్యాపేట, తూప్రాన్, తుంగతుర్తిలో ప్లాట్లు, వ్యవసాయ భూమి 
  5. ఇంట్లో రూ.10లక్షలు, బ్యాంకు ఖాతాలో రూ.71 లక్షలు
  6. ఇసుక వ్యవహారంపైనా ఆరా
  7. డ్రైవర్‌కు దఫాలుగా రూ.24 లక్షలు బదిలీ 
  8. కుమార్తె ఖాతాలకూ నగదు బదిలీ!
  9. జయరాజ్‌ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు

భూపాలపల్లి/మేడ్చల్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్(Assistant Director of the Mines Department, Jayashankar Bhupalpally district) (ఏడీ) బొజ్జ జయరాజ్‌కు(Bojja Jayaraj) సంబంధించిన నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ(Anti-Corruption Bureau) (ఏసీబీ) అధికారులు గురువారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్, వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి.

హైదరాబాద్‌లోని బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్‌నగర్‌లో ఉన్న జయరాజ్ నివాసంతో పాటు భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లోని మైనింగ్ ఏడీ కార్యాలయం, సూర్యాపేట, తాండూరు తదితర ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన నివాసాలు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కలిపి మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. జయరాజ్ ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ములుగు జిల్లా ఇన్‌చార్జిగానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో పాటు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొందరితో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు.. పెద్ద ఎత్తున అక్రమాస్తులను గుర్తించి జయరాజ్‌ను అరెస్టు చేశారు.   

భూపాలపల్లి మైనింగ్ కార్యాలయంలో..

భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లోని మైనింగ్ ఏడీ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలోని బృందం కార్యాలయంలోని ఫైళ్లు, రికార్డులు, అధికారిక పత్రాలు, మైనింగ్ అనుమతులు, ఇసుక క్వారీలకు సంబంధించిన వివరాలు తదితరాలను పరిలించారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిసింది. 

ఇసుక వ్యవహారంపైనా.. 

జయరాజ్ గతంలో ములుగు జిల్లా మైనింగ్ ఇన్‌చార్జిగానూ బాధ్యతలు నిర్వహించారు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఇసుక, ఎర్రమట్టి మైనింగ్ కార్యకలాపాలు ఎక్కువగా ఉండటంతో వాటికి సంబంధించిన వ్యవహారాల్లో ఆయనపై గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఇసుక క్వారీల కేటాయింపు, నిర్వహణ, అక్రమ రవాణా తదితర అంశాల్లో ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించారన్న ఫిర్యాదులు ఉన్నాయి.

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న కొందరితో జయరాజ్ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపైనా ఏసీబీ ఆరా తీసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అక్రమంగా సంపాదించిన సొమ్మును స్థిరాస్తులు, బ్యాంకు డిపాజిట్లు లేదా ఇతర పెట్టుబడుల రూపంలోకి మార్చారా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.

భూపాలపల్లితో పాటు ములుగు జిల్లాలో ఆయన గతంలో నిర్వహించిన బాధ్యతలకు సంబంధించిన రికార్డులను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. అదే విధంగా సూర్యాపేట, వికారాబాద్ జిల్లా తాండూరు తదితర ప్రాంతాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో భూములు, ఇండ్ల్లు, ప్లాట్లు, వాహనాలు, బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, నగదు, బంగారం తదితర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.  

బోడుప్పల్ నివాసంలో..

హైదరాబాద్‌లోని బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్‌నగర్‌లోని జయరాజ్ నివాసానికి  ఏసీబీ అధికారులు గురువారం ఉదయం చేరుకుని సోదాలు ప్రారంభించారు. ఇంట్లోని ప్రతి గది, అల్మారాలు, ముఖ్యమైన రికార్డులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, ఆర్థిక లావాదేవీల వివరాలను పరిశీలించారు.

జయరాజ్ కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులు, స్థిరాస్తుల కొనుగోలు, వాటికి చెల్లించిన మొత్తాలు, ఆదాయ వనరులతో వాటి అనుసంధానం వంటి అంశాలపైనా అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. సోదాల్లో లభించే పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లు తదితరాలను అధికారులు నమోదు చేసుకున్నారు.  

డ్రైవర్ బ్యాంకు ఖాతాలపైనా దృష్టి    

జయరాజ్‌కు కారు డ్రైవర్ బ్యాంకు ఖాతా లావాదేవీలపైనా ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ ఖాతా నుంచి పలు దఫాలుగా రూ.24 లక్షలకు పైగా నగదు బదిలీ అయినట్లు కొన్ని వర్గాల ద్వారా సమాచారం.  అంతేకాకుండా డ్రైవర్ ద్వారా జయరాజ్ కూతరు ఖాతాలకు లావాదేవీలు జరిగాయని డ్రైవర్ వెల్లడించినట్లు తెలుస్తోంది.   ఆరోపణలకు సంబంధించి బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఫోన్‌లోని లావాదేవీల వివరాలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలించే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అంశాలు  

ఏసీబీ సోదాల్లో సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. బోడుప్పల్‌లో రెండు అంతస్తుల భవనం, కేపీహెచ్‌బీలో ఫ్లాట్, కీసర, సూర్యాపేట, తూప్రాన్, తుంగతుర్తిలో ప్లాట్లు, సూర్యాపేటలో 3.21 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఆయన నివాసంలో రూ.10 లక్షల నగదు, బ్యాంకు ఖాతాలో రూ.71 లక్షల నగదును గుర్తించారు.

జయరాజు డ్రైవర్‌కు పలు దఫాలుగా రూ.24 లక్షలు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇసుక మామూళ్లకు సంబంధించిన నగదును జయరాజు కుమార్తె డ్రైవర్ ఖాతాకు బదిలీ చేసినట్లు డ్రైవర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలపైనా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు ఉన్నట్లు తెలిసింది.  అయితే ఈ వివరాలన్నింటిపై ఏసీబీ నుంచి తుది అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  

ఇటీవలే ‘ఉత్తమ అధికారి’ అవార్డు

జయరాజ్‌కు ఇటీవల జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి జిల్లాలో ‘ఉత్తమ అధికారి’గా ప్రశంసా పత్రం, అవార్డు అందజేసినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అవార్డు అందుకున్న కొద్ది రోజులకే ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.