28 August, 2026 | 5:39 AM

సెప్టెంబర్ 7న సీడబ్ల్యూసీ భేటీ

28-08-2026 02:51 AM
  1. ఢిల్లీలోని సేవాభవన్‌లో కీలక సమావేశం
  2. అజెండా, డేటా ఇవ్వని తెలంగాణ, ఏపీ
  3. సీడబ్ల్యూసీ అసంతృప్తి, వివరాలు కోరుతూ లేఖలు
  4. అజెండా, డేటాపైనే ప్రధాన చర్చ  
  5. జల వివాదాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం  

 హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి) : తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మధ్య నెలకొన్న జల వివాదాల(water disputes)పై చర్చించేందుకు కేంద్ర జల సంఘం(Central Water Commission) (సీడబ్ల్యూసీ) మరోసారి భేటీ కానుంది. సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన కమిటీ రెండో సమావేశం సెప్టెంబర్ 7న ఢిల్లీలోని సేవాభవన్‌లో జరగనుంది. ఈ భేటీకి సంబంధించి సీడబ్ల్యూసీ ప్రాజెక్ట్ అప్రైజల్ (సౌత్) డైరెక్టరేట్  తాజాగా నోటీసు జారీ చేసింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి నిర్వహణ అంశాలపై చర్చించి, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించనున్నారు. 

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2026 జనవరి 2న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు సీడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ..  మూడు నెలల వ్యవధిలో నివేదిక సమర్పించాల్సి ఉంది. కమిటీ తొలి సమావేశం ఈ ఏడాది జనవరి 30న జరిగింది. ఆ సమావేశంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమకు సంబంధించిన కీలక అజెండా అంశాలను, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు, గణాంకాలు, ఆధారాలను కమిటీకి సమర్పించాలని నిర్ణయించాయి.

ఇందుకు సంబంధించిన సమావేశపు మినిట్స్‌ను ఫిబ్రవరి 12న సీడబ్ల్యూసీ రెండు రాష్ట్రాలకు పంపింది. అయితే, సమావేశం జరిగి నెలలు గడుస్తున్నా ఇరు రాష్ట్రాల నుంచి కూడా కమిటీ కోరిన విధంగా పూర్తి స్థాయి అజెండా అంశాలు, సంబంధిత డేటా అందలేదని సీడబ్ల్యూసీ తాజాగా జారీ చేసిన నోటీసులో పేర్కొంది. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు రెండు రాష్ట్రాలను గుర్తు చేసినప్పటికీ స్పందన రాలేదని తెలిపింది.

కమిటీ తదుపరి సమావేశంలో చర్చించాల్సిన అంశాల కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సీడబ్ల్యూసీ ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేకంగా డెమి--ఆఫిషియల్ (డీవో) లేఖలు కూడా పంపినట్లు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 7న జరిగే రెండో సమావేశంలో తెలంగాణ, ఏపీలు తమ అజెండా అంశాలను ఎందుకు సమర్పించలేదనే అంశంపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు జల వివాదాలు కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.    

ఈ భేటీలోనైనా అజెండా అంశాలను సమర్పించేనా?

సెప్టెంబర్ 7 సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో పాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ), జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూఏ) అధికారులు కూడా హాజరుకానున్నారు. ఏపీ తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి, జలవన రుల శాఖ సలహాదారు, ఇంజనీర్-ఇన్--చీఫ్ (ఇరిగేషన్), ఐఎస్‌అండ్ డబ్ల్యూఆర్ చీఫ్ ఇంజనీర్ కమిటీ సభ్యులుగా ఉన్నారు.

తెలంగాణ తరఫున నీటిపారుదల, జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రత్యేక కార్యదర్శి, ఇంజనీర్--ఇన్---చీఫ్(జనరల్) సభ్యులుగా ఉన్నారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ చైర్మన్లు, ఎన్‌డబ్ల్యూఏ చీఫ్ ఇంజనీర్‌తో పాటు సీడబ్ల్యూసీకి చెందిన పలువురు ఉన్నతాధికారులను కూడా సమావేశానికి ఆహ్వానించారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వాటాలు, బోర్డుల పరిధి వంటి అంశాలపై ఏపీ, తెలంగాణ మధ్య చాలాకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 7న జరిగే భేటీలో రెండు రాష్ట్రాలు తమ వివరాలను సమర్పిస్తాయా? లేక మరింత సమయం కోరుతా యా? అన్నది ఆసక్తికరంగా మారింది.