28 August, 2026 | 4:10 AM

జీవో 97ను రద్దు చేయాలి

28-08-2026 02:17 AM
  1. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తాం 
  2. అవసరమైతే ఢిల్లీలో కదం తొక్కుతాం 
  3. ఉద్యోగుల జోలికొస్తే పతనం తప్పదు 
  4. మాజీమంత్రి హరీశ్‌రావు
  5. వరంగల్ పర్యటన ఉద్రిక్తం.. స్వల్ప అస్వస్థత

మహబూబాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యార్థుల(Polytechnic students)కు నష్టం కలిగించే జీవో 97ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) డిమాండ్ చేశారు. జీవోనే వెనక్కి తీసుకోకపోతే విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని, అవసరమైతే ఢిల్లీలో కదం తొక్కుతా మని హెచ్చరించారు. గురువారం హరీశ్‌రావు(Harish Rao) వరంగల్ పర్యటన ఉద్రిక్తంగా సాగింది.

హైదరాబాదు నుంచి వరంగల్ బయలుదేరిన హరీశ్‌రావు తొలుత హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(Joint Action Committee of Employee and Teacher Associations) ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా, అవసరం లేని పనులకు వేల కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేస్తుందని మండిపడ్డారు.

ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదన్నారు.అనంతరం వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి బయలుదేరగా పోలీసులు హరీశ్‌రావును అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్‌ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. హరీష్‌రావును రక్షక్ వాహనంలో ఎక్కించడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేసినా సాధ్యం కాకపోవడంతో కాలినడకన సమీపంలోని పోలీస్‌స్టేష న్‌కు తరలించారు.

హరీశ్‌రావుతో పాటు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, హనుమకొండ పశ్చిమ మాజీ దాస్యం వినయ భాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న పాలిటెక్నిక్ విద్యార్థులు.. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. తీవ్రమైన జన సందోహం మధ్య ఒత్తిడికి గురైన హరీశ్‌రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

ఈ సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులు, బీఆర్‌ఎస్ కార్యక్త్రలు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. కొద్దిసేపటి తర్వాత చేరుకున్న హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని, ఏ రంగానికి కూడా ప్రభుత్వం మేలు చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. ఉద్యోగులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ఆరు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని విమర్శించారు.

ప్రభుత్వానికి ఉద్యోగులు వెన్నెముక లాంటి వారిని, అలాంటి వారికి డీఎలు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే అంగన్‌వాడీ కార్యకర్తలకు ఒక్క రూపాయి జీతం కూడా పెంచలేదని, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని  పూర్తిగా అంగన్‌వాడీ టీచర్లే నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేశజాలకు పోకుండా జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన బీఆర్‌ఎస్ కొట్లాడుతుందని హామీ ఇచ్చారు. కాగా హరీశ్‌రావును సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు రక్షక్ వాహనంలో నగర శివారు వరకు తరలించి, అక్కడ నుంచి పోలీసు ఎస్కార్ట్ తో సిద్దిపేటకు పంపించారు.