జెన్‌జీ చేతుల్లోనే రేపటి రాజ్యాధికారం
- ఉద్యోగాలిచ్చే స్థాయికి యువత ఎదగాలి
- విద్య, వైద్యానికి బడ్జెట్‌లో 40 శాతం కేటాయిస్తాం
- భూమిలేని ప్రతి కుటుంబానికి రెండెకరాల భూమి
- టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
భువనగిరి, ఆగస్టు 27(విజయక్రాంతి): జెన్‌జీ యువత(Genji youth) తలచుకుంటే దేశ రాజకీయాలనే మార్చగలదని, సోషల్ మీడియా(social media) ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తి నేటి యువత చేతుల్లో ఉందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ)వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallann) అన్నారు. శుక్రవారం భువనగిరి జిల్లా ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘జెన్ జడ్ మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో దాదాపు గంటలపాటు ముచ్చటిస్తూ రాజకీయాలు, విద్యా వ్యవస్థ, సోషల్ మీడియా ప్రభావం, భవిష్యత్ తెలంగాణ, యువత పాత్ర వంటి అనేక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పార్టీ నాయకులు మల్లన్నకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మొక్కలు మొక్కలు నాటారు. కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మల్లన్న, తనకు ఈ కళాశాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను కూడా ఇదే కళాశాలలో చదువుకున్నానని, తనతో చదివిన స్నేహితులు, తన భార్య ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా తాను రాజకీయ నాయకుడిగా మారానని తెలిపారు.
భవిష్యత్ రాజకీయాల్లో జెన్‌జీ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న మల్లన్న, తమిళనాడులో సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రాజకీయ పరిణామాలను ఎలా ప్రభావితం చేసిందో వివరించారు. విద్యార్థులందరూ సోషల్ మీడియాను కేవలం వినోదం కోసం కాకుండా తమ ఆలోచనలను వ్యక్తపరిచే సాధనంగా ఉపయోగించుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉదాహరణను ప్రస్తావించిన మల్లన్న, యువత అనుకుంటే ఏదైనా సాధ్యమని అది నిరూపించిందన్నారు.
ప్రస్తుతం యువత మొత్తం ఉద్యోగాల కోసం పోటీ పడుతోందని, కానీ భవిష్యత్‌లో ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని మల్లన్న పిలుపు నిచ్చారు.అధికారాలు మారినా యువత సమస్యలు మారడం లేదని, విద్యార్థులు స్వయం ఉపాధి, ఆవిష్కరణలు, వ్యాపార రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. టీఆర్పీ అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థనే మార్చేస్తామని మల్లన్న పేర్కొన్నారు. ‘ప్రతి విద్యార్థికి కులం, మతం, ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా నాణ్యమైన ఉచిత విద్య అందాలి.
అదే మా కల. అదే మా లక్ష్యం’ అని చెప్పారు.ప్రైవేట్ విద్యా వ్యవస్థ పెత్తనాన్ని తగ్గిస్తూ ప్రభుత్వ విద్యను అత్యున్నత స్థాయికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఎ వరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఏ విషయం అయినా వెరిఫై చేసుకోవాలి. ప్రతి అంశాన్ని రీసెర్చ్ చేయాలి అని విద్యార్థులకు సూచించారు.‘అందరూ వేరు... మల్లన్న వేరు. నా జీవిత ప్రయాణాన్ని తెలుసుకోండి.
నేను అధికార పార్టీని వదిలి వచ్చాను అని పేర్కొన్నారు.టీఆర్పీలో యువత పాత్రపై అడిగిన ప్రశ్నకు మల్లన్న స్పందిస్తూ, మా పార్టీలో యువతకు అత్యధిక ప్రాధాన్యం ఉంది అని పేర్కొన్నారు.‘2029లో తెలంగాణలో తప్పకుండా బీసీ రాజ్యం వస్తుంది. ప్రజలకు నిజమైన రాజ్యాధికారం రావాలంటే చైతన్యవంతమైన యువత ముందుకు రావాలి’ అని స్పష్టం చేశారు.
మొక్కలు నాటిన మల్లన్న
ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మొక్కలను నాటారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొమిరిశెట్టి నర్సింహులు,క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్ ,మహిళా అధ్యక్షురాలు బుద్ధుల సునీత,రాష్ట్ర నాయకులు పిట్టల శంకర్,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మురళి ముదిరాజ్,కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం, ఇతరప్రముఖులు పాల్గొన్నారు.
బీసీల రాజ్యాధికారమే లక్ష్యం
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 59 కీలక నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని ‘సర్జికల్ స్ట్రైక్-59‘ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా బీసీ ముఖ్యమంత్రిని గద్దెపై కూర్చోబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.అధికారం కోసం అగ్రవర్ణ నేతలు సిద్ధాంతాలను మార్చుకుంటూ పార్టీలు మారుతున్నారని మల్లన్న విమర్శించారు. ప్రజలు పార్టీలను కాకుండా తమ సామాజిక వర్గాల రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న అగ్రవర్ణ రెడ్డి, వెలమ, కమ్మల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, బీసీ రాజ్యాధికార సాధనే లక్ష్యంగా టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన గణాంకాలను విడుదల చేశారు. సిర్పూర్, ఎల్లారెడ్డి, మంచిర్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం బీసీ ఓటర్ల ఉన్నప్పటికీ వెలమలే పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువత ఎక్కువ మంది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలని ఆయన పిలుపు నిచ్చారు.






