11 July, 2026 | 2:01 AM

మత్తు రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

11-07-2026 01:03 AM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి, జూలై 10 (విజయక్రాంతి): యువత దేశ భవిష్యత్తు అని, వారు మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండి తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ధర్మపురి పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మిషన్ పరివర్తన్ డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టారని తెలిపారు. డ్రగ్స్ దందాను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ టీంలను ఏర్పాటు చేసిందన్నారు. ఒక్కసారి మాత్రమే తీసుకుంటే ఏమవుతుంది అనే నిర్లక్ష్య ధోరణే జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. విద్యాసంస్థలు లేదా పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయం, వినియోగం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మత్తు పదార్థాలకు బానిసైన వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీ-అడిక్షన్ సెంటర్లలో వైద్య చికిత్సతో పాటు కౌన్సెలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జిల్లా మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి యువతను సరైన దారిలో నడిపించాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.

అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లు, సందేశాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువత డ్రగ్స్కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి భాస్కర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.