11 July, 2026 | 2:01 AM

ఏబీ స్విచ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

11-07-2026 01:00 AM

దోమకొండ, జూలై 10 (విజయ క్రాంతి): దోమకొండలో ప్రతిరోజూ ఎదురవుతున్న విద్యుత్ కోతల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఏబీ స్విచ్ల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను డివిజనల్ ఇంజనీర్ డీఈ నందకుమార్ ఆదేశించారు. వారం నుంచి పది రోజుల్లో గ్రామంలోని ప్రధాన విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

దోమకొండలో తరచూ విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించి విద్యుత్ శాఖ సీఎండీ వరుణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిసింది.

దీంతో స్పందించిన డీఈ నందకుమార్ శుక్రవారం సాయంత్రం దోమకొండ గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి సర్పంచ్, పాలకవర్గ సభ్యులతో సమావేశమై విద్యుత్ సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. వీధి దీపాల విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ నర్సయ్య కోరగా, దీనిపై కూడా తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏడీఈ సుదర్శన్ రెడ్డిని డీఈ ఆదేశించారు.

వారం నుంచి పది రోజుల్లో దోమకొండలో విద్యుత్ సమస్యలను గణనీయంగా తగ్గించేలా చర్యలు తీసుకుంటామని డీఈ నందకుమార్ హామీ ఇవ్వగా, స్పందించిన సర్పంచ్ ఐరేని నర్సయ్య సమస్య పరిష్కారానికి చొరవ చూపిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఏడీఈ సుదర్శన్ రెడ్డి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్ధరాములు, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, కటిక శ్రీనివాస్, నాయకులు కుల సంతోష్, శంకర్, విద్యుత్ శాఖ సిబ్బంది శంకర్, సురేష్ పాల్గొన్నారు.